బుమ్రా, ఆయ్యర్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఆ టోర్నీలో ఆడే అవకాశం!
టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. బుమ్రా వెన్నుగాయంలో చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది ఆసియా కప్ కు ముందు గాయం నుంచి కోలుకున్నట్లు కనిపించిన బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆసియా కప్ టీ20, టీ20 వరల్డ్ కప్ నుంచి అతను తప్పుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడలేదు. మార్చిలో శస్త్ర చికిత్స చేయించుకున్న అతను.. నేషనల్ క్రికెట్ అకాడమీలో వేగంగా కోలుకుంటున్నాడు. బుమ్రాతో పాటు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయర్ అయ్యర్ కూడా అక్కడే ఉన్నాడు.
వేగంగా కోలుకుంటున్న శ్రేయస్, బుమ్రా
అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో అతను ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న అయ్యర్ కూడా ఎన్సీఏలోనే ఉన్నారు. వీళ్లిద్దరూ వేగంగా కోలుకుంటున్నట్లు ఎన్సీఏ ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని కుదురుకుంటే బుమ్రా, అయ్యర్ ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్ లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం బుమ్రా తన సోషల్ మీడియాలో క్రికెట్ షూస్ ఫోటో షేర్ చేశాడు. దీంతో అతను మళ్లీ బౌలింగ్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపించాయి. బుమ్రా, శ్రేయస్ జట్టులో చేరితో టీమిండియా బలం పెరుగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.