ఆ విషయంలో వెనక్కి తగ్గం.. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. జో రూట్ అద్భుతంగా ఆడుతున్న తొలి రోజునే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయమే ఇంగ్లండ్ జట్టు ఓటమికి కారణమని విమర్శలు వస్తున్నాయి. దూకుడుగా ఆడాలి గానీ, మరి ఎక్కువైతే కష్టమనే కామెంట్లు వినిపించాయి. లార్డ్స్ వేదికగా జూన్ 28న యాషెస్ సిరీస్‌లో రెండు టెస్టు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కలమ్ కీలక విషయాలను వెల్లడించారు. లార్డ్స్ టెస్టులో మరింత దూకుడుగా ఆడతామని అతను స్పష్టం చేశారు. బజ్‌బాల్ విధానంలో ఏ మాత్రం వెనక్కి తగ్గమని తెలిపారు.
అదృష్టం కలిసి రాలేదన్న మెక్‌కలమ్
తమ టెస్టులో మొదటి టెస్టును ఆడి, ముందుకు తీసుకెళ్లామని, ఆస్ట్రేలియా ప్లేయర్లు వారి స్టైల్ లో ఆడి గెలిచారని, తాము మాత్రం మరింత ఎక్కువ ముందుకెళ్తామని, అయితే ఈ సిరీస్ మొత్తం చాలా రసవత్తరంగా సాగుతుందని మెక్‌కలమ్ చెప్పుకొచ్చాడు. తొలి టెస్టు ఆడిన తీరు సంతృప్తికరంగానే అనిపించిందని, అయితే అదృష్టం కలిసి రాలేదని పేర్కొన్నారు. యాషెస్ తొలి టెస్టు చివరి రోజు ఇంగ్లండ్ ఓ దశలో గెలిచేలా కనిపించినా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వీరోచిత పోరాటం చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.