KL Rahul : ఫామ్ లేమి ప్రభావం.. తక్కువ ధరకు అమ్ముడైన కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2025 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఫ్రాంచైజీలు తమ ప్రియమైన ఆటగాళ్ల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఈ వేలంలో టీమిండియా యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌కు రికార్డు స్థాయిలో ధర పలికింది. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. రిషబ్ పంత్ మెగా వేలంలో తనకు పెట్టిన భారీ అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ, 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడికి ఇంత ధర పలకలేదు.
కేఎల్ రాహుల్ కోసం పోటీ పడ్డ కేకేఆర్, ఆర్సీబీ
రిషబ్ పంత్ తర్వాతి స్థానంలో శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్ వేలంలో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాడు. గత సీజన్‌లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్, మేనేజ్మెంట్‌తో విభేదాల కారణంగా వేలంలోకి వచ్చాడు. అయితే ఇటీవల ఫామ్ లేమి కారణంగా ఫ్రాంచైజీలు అతడిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కేవలం రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్ కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడినా ఫలితం లేకుండా పోయింది.