England: ఐసీసీ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ సాధించిన రికార్డులివే!
క్రికెట్‌కు ఇంగ్లండ్ పుట్టినిల్లు. అయినా ఆ దేశానికి ప్రపంచ కప్ రావటానికి 44 ఏళ్లు పట్టింది. తొలిసారి 1975లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో గెలిచి వెస్టిండీస్ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత 44 ఏళ్ల తర్వాత 2019లో మళ్లీ అదే లండన్ గ్రౌండ్ లో ఎన్నో మలుపులతో ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచులో సూపర్ విక్టర్ కొట్టి 2019 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 2023 వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న భారత్ వేదికగా ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో తలపడనుంది.
48 మ్యాచుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్
మొదటి మూడు ప్రపంచ కప్‌లు (1975, 1979, 1983) మ్యాచులు యూకే వేదికగా జరిగాయి. ఇప్పటివరకూ ప్రతి ఎడిషన్ లో పాల్గొన్న ఇంగ్లండ్ 83 ప్రపంచ కప్ మ్యాచులను ఆడింది. ఇందులో 48 మ్యాచుల్లో విజయం సాధించగా, మరో 32 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక రెండు మ్యాచులు టై అయ్యాయి. వన్డే ప్రపంచ కప్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులు గెలిచిన నాలుగో జట్టుగా అవతరించే అవకాశం ఉంది. ఆ మైలురాయిని చేరుకోవడానికి ఇంగ్లండ్ 2 విజయాల దూరంలో ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా (69), భారత్ (54), న్యూజిలాండ్ (53) మాత్రమే ఈ ఘనత సాధించిన జట్లుగా రికార్డుకెక్కాయి. ఇక పాకిస్థాన్ 45 మ్యాచుల్లో నెగ్గింది.
2019లో ప్రపంచ కప్ ను నెగ్గిన ఇంగ్లండ్
లార్డ్స్‌లో జరిగిన 2019 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఇంగ్లండ్ ఓడించింది. ఈ మ్యాచులో సూపర్ ఓవర్ కూడా టై కావడంతో, బౌండరీ ఫలితం ఆధారంగా ఇంగ్లండ్ జట్టును విజేతగా ప్రకటించారు. వన్డే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టోక్స్ ఇప్పటివరకూ 11 వన్డే ప్రపంచ కప్ మ్యాచులను ఆడాడు. ఇందులో 66.42 సగటుతో 465 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలను బాదాడు. బౌలింగ్ విభాగంలో ఏడు వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను 16 మ్యాచుల్లో 21 వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత స్థానంలో జోఫ్రా ఆర్చర్ (20) ఉన్నాడు.