LOADING...
Abhimanyu Easwaran: గౌతమ్ గంభీర్ నా కొడుకుకు అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చాడు: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి 
గౌతమ్ గంభీర్ నా కొడుకుకు అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చాడు: అభిమన్యు తండ్రి

Abhimanyu Easwaran: గౌతమ్ గంభీర్ నా కొడుకుకు అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చాడు: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్‌ మేనేజ్‌మెంట్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. అయితే, అతడిని ప్రధాన ఆటగాళ్లకు బ్యాకప్‌గా మాత్రమే ఉంచి, ఒక్క మ్యాచ్‌కైనా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇదే విషయంపై కొద్ది రోజుల క్రితం అభిమన్యు తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్ విఫలమైన సందర్భాల్లో కూడా అవకాశాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్, తన కుమారుడి విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాజాగా, అభిమన్యు అంతర్జాతీయ అరంగేట్రం అవకాశంపై ఆయన మరోసారి స్పందించారు.

వివరాలు 

భవిష్యత్తులో టీమిండియాకు మరింత కాలం ఆడేలా కోచింగ్ బృందం మద్దతు

"నా కుమారుడితో స్వయంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. 'నువ్వు సరైన దారిలో ఉన్నావు, నీకు ఖచ్చితంగా ఆడే అవకాశం వస్తుంది. నీ ప్రయాణం దీర్ఘకాలం కొనసాగుతుంది' అని అతడికి చెప్పాడు. అలాగే, ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి బయటకు పంపించే వ్యక్తిని తాను కాదని స్పష్టంచేశాడు. ఈ విషయాలను అభిమన్యు నాతో పంచుకున్నాడు. ఆ మాటల ద్వారా భవిష్యత్తులో టీమిండియాకు మరింత కాలం ఆడేలా కోచింగ్ బృందం మద్దతు ఇస్తుందనే విషయం నాకు అర్థమైంది. గత నాలుగేళ్లుగా నా కుమారుడు ఆ అవకాశానికి ఎదురుచూస్తున్నాడు" అని రంగనాథన్‌ వివరించారు.

వివరాలు 

అక్కడ ఆడించాల్సింది.. 

"పచ్చిక ఎక్కువగా ఉన్న పిచ్‌లపై అభిమన్యు బాగా రాణిస్తాడు.ఇక్కడ నేను సాయి సుదర్శన్‌ను తక్కువ చేయడం లేదు. కానీ ఇంగ్లాండ్ సిరీస్‌లో అభిమన్యుకి అవకాశం ఇచ్చి ఉంటే మంచిది.సాయి వన్‌డౌన్‌లో వచ్చి 0,31, 0,61 పరుగులు చేశాడు.అదే స్థానంలో అభిమన్యు ఆడితే ఫలితాలు భిన్నంగా ఉండేవి.ఎందుకంటే,ఈడెన్ గార్డెన్స్‌లో సుమారు 30శాతం మ్యాచ్‌లు గ్రీన్ ట్రాక్‌లపై ఆడిన అనుభవం అతడికి ఉంది. అంతేకాక,ఇన్నింగ్స్‌ను సుదీర్ఘంగా కొనసాగించే సామర్థ్యం ఉన్న బ్యాటర్ అతడు. మరోవైపు,కరుణ్ నాయర్ ఎప్పుడూ వన్‌డౌన్‌లో ఆడిన వ్యక్తి కాదు. విదర్భ జట్టుకు రెండో లేదా మూడో డౌన్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసేవాడు.అలాంటి ఆటగాడికి మేనేజ్‌మెంట్ అవకాశాలు ఇచ్చి,టాప్ ఆర్డర్‌లో ఆడే నా కుమారుడిని మాత్రం పక్కన పెట్టారు"అని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు 

 2022లోనే టీమ్ ఇండియా జట్టులో అభిమన్యు

అభిమన్యు ఈశ్వరన్‌కి 2022లోనే టీమ్ ఇండియా జట్టులో అవకాశం లభించింది. అప్పటి నుంచి పలు సార్లు స్క్వాడ్‌లో చోటు సంపాదించినప్పటికీ, ఫైనల్ XIలో మాత్రం ఇంకా ఆడే అవకాశం రాలేదు.