Page Loader
Gautam Gambhir: ఆస్ట్రేలియా పర్యటనకు చెతేశ్వర్ పుజారాను కోరుకున్న గంభీర్‌..అభ్యర్థనను తిరస్కరించిన సెలక్టర్లు 
ఆస్ట్రేలియా పర్యటనకు చెతేశ్వర్ పుజారాను కోరుకున్న గంభీర్‌

Gautam Gambhir: ఆస్ట్రేలియా పర్యటనకు చెతేశ్వర్ పుజారాను కోరుకున్న గంభీర్‌..అభ్యర్థనను తిరస్కరించిన సెలక్టర్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్‌లో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ,హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి. భారత జట్టు గత ఏడు టెస్టుల్లో కేవలం మూడు విజయాలను మాత్రమే సాధించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, ఆ తర్వాతి మ్యాచ్‌లలో అనుకూల ఫలితాలు అందుకోలేకపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్, టెస్టు చరిత్రలో సొంతగడ్డపై ఇంతటి విఫలతను ఎదుర్కొన్న తొలి జట్టుగా నిలిచింది. ఈ పరాజయాన్ని మరచిపోవడానికి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024-25లో పునరాగమనం సాధించాలని నిర్ణయించుకొని, ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది.

వివరాలు 

టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఉద్రిక్తంగా వాతావరణం 

అయితే, ఆస్ట్రేలియాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా, పెర్త్‌లో జస్‌ప్రీత్ బుమ్రా సారధ్యంలో 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో జట్టు పుంజుకుంటున్నట్లే కనిపించింది. తర్వాతి టెస్టుల్లో పరిస్థితి మళ్లీ మారింది. ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్‌లో వర్షం కారణంగా డ్రా చేసుకున్నా, మెల్‌బోర్న్ టెస్టులో 184 పరుగుల తేడాతో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య, రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలని.. గంభీర్‌ టెస్టు జట్టు కోచింగ్‌ బాధ్యతల నుంచి వైదొలగాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో, టీమిండియా డ్రెస్సింగ్ రూంలో వాతావరణం ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం అందుతోంది. బీసీసీఐ ఈ అంశాలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

వివరాలు 

పుజారాకు ఆస్ట్రేలియా గడ్డపై గొప్ప రికార్డు

ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ఆసక్తికరంగా, ఆస్ట్రేలియాకు పర్యటనకు వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాను ఎంపిక చేయాలని సూచించాడు. అయితే, సెలక్టర్లు గంభీర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పుజారాకు ఆస్ట్రేలియా గడ్డపై గొప్ప రికార్డు ఉంది. 2018-19 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 521 పరుగులతో అతను భారత జట్టు లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 2020-21 సీజన్‌లోనూ బాగా రాణించిన పుజారా, మొత్తం 11 టెస్టు మ్యాచ్‌లలో 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో 14, 27 పరుగులు చేసిన ఈ సౌరాష్ట్ర బ్యాటర్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీలలో, దేశీ రంజీ మ్యాచ్‌లలో మెరుగైన ఫార్మ్ చూపిస్తున్నాడు.

వివరాలు 

 గౌతమ్ గంభీర్‌పై చర్యలు 

ఈ పరిస్థితిలో, గంభీర్ పుజారాను పిలవాలని కోరినా, సెలక్టర్లు అతని అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు మరింత తీవ్రం అవుతున్నాయి, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా వున్నాయని తెలుస్తోంది.