LOADING...
GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం
గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం

GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టు, తొలి విజయాన్ని అందుకోవాలని కసితో ఉన్న కోల్‌కతా జట్టుతో నేడు తలపడబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (ఐపీఎల్)లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ ఆసక్తికర మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. స్వదేశంలో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు తమ విజయం పరంపరను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఎట్టిపరిస్థితుల్లోనైనా గెలుపు ఖాతా తెరవాలని సంకల్పంతో బరిలోకి దిగుతోంది. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

వివరాలు

గిల్ వైపే అందరి చూపు..

గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభమన్ గిల్ ప్రధాన శక్తిగా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ జట్టుకు బలంగా మారాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ మైదానంలో అతని ప్రదర్శనలు ఎంతో విశేషంగా ఉండటం జట్టుకు మరింత ధైర్యం ఇస్తోంది. అతనితో పాటు సాయి సుదర్శన్ కూడా స్థిరంగా పరుగులు చేస్తూ బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ వంటి బౌలర్లు సమర్థంగా ప్రత్యర్థులను అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో రబాడా, సిరాజ్, ప్రసిద్ వేగవంతమైన బౌలింగ్‌తో కీలక వికెట్లు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వివరాలు

మరింత ఒత్తిడిలో కేకేఆర్..

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. అజింక్య రహానే నాయకత్వంలోని ఈ జట్టు సమన్వయం లోపంతో బాధపడుతోంది. భారీ అంచనాల మధ్య జట్టులో చేరిన కామెరూన్ గ్రీన్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. అలాగే ఫినిషర్‌గా పేరున్న రింకూ సింగ్ కూడా గత సీజన్ల మాదిరిగా ప్రభావం చూపడంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌పై పెట్టుకున్న నమ్మకం కూడా ఫలించడం లేదు. గుజరాత్ బ్యాటర్లను ఒత్తిడికి గురిచేసే స్థాయిలో ఏ బౌలర్ కనిపించడం లేదు. వరుస ఓటముల కారణంగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది.

Advertisement

వివరాలు

ముందంజలో గుజరాత్..

పిచ్ పరిస్థితులను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌లోని ఈ మైదానం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. బంతి సులభంగా బ్యాట్‌పైకి రావడం వల్ల పెద్ద స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ చేయడానికే ఆసక్తి చూపవచ్చు. గత మ్యాచ్‌ల్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే లక్ష్యాన్ని చేధించిన జట్లకే ఎక్కువ విజయాలు దక్కాయి. మొత్తానికి బలాబలాల పరంగా గుజరాత్ జట్టే ముందంజలో ఉన్నప్పటికీ, కీలక పరిస్థితిలో ఉన్న కోల్‌కతా జట్టు ఎంతవరకు పోరాడుతుందో ఆసక్తిగా మారింది.

Advertisement