Page Loader
Virat Kohli: న్యూజిలాండ్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. సచిన్‌ను అధిగమించే దిశగా విరాట్ 
న్యూజిలాండ్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. సచిన్‌ను అధిగమించే దిశగా విరాట్

Virat Kohli: న్యూజిలాండ్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. సచిన్‌ను అధిగమించే దిశగా విరాట్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. పాకిస్థాన్‌పై శతకం బాది ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్‌పై అద్భుత రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మరోసారి రాణించాలని అభిమానులు, టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆశిస్తోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో కోహ్లీ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే, సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న పలు రికార్డులను అధిగమించే అవకాశం ఉంది. కోహ్లీ 106 పరుగులు చేయగలిగితే, సచిన్‌ను దాటి న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.

Details

టాప్ లో సచిన్ టెండూల్కర్

ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ 42 వన్డేల్లో 1750 పరుగులతో ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా సచిన్ ఐదు శతకాలు, ఎనిమిది అర్ధశతకాలు సాధించాడు. కోహ్లీ ఇప్పటివరకు 31 వన్డేలు ఆడి 1645 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. మొత్తం జాబితాలో రికీ పాంటింగ్ 1971 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్‌పై 85 పరుగులు చేసినా కోహ్లీ మరో అరుదైన రికార్డు నమోదు చేయనున్నాడు. అతడు 3,000 పరుగుల మైలురాయిని చేరుకుని న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు భారత్ తరఫున సచిన్ తెందూల్కర్ (3,345) మాత్రమే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

Details

 మొదటి స్థానంలో రికీ పాంటింగ్

అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (3,145), జాక్వెస్ కలిస్ (3,071), జో రూట్ (3,068) తర్వాత కోహ్లీ పేరు చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 55 మ్యాచ్‌లు ఆడి 47.01 సగటుతో 2,915 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. కివీస్‌పై కోహ్లీ చివరి వన్డే 2023 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 117 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడతాడా? సచిన్ రికార్డును బద్దలు కొట్టగలడా? అనేదే ఆసక్తికరంగా మారింది.