ICC World Cup 2023: ప్రపంచకప్ రేసులో రవిచంద్రన్ అశ్విన్!
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలింగ్ ర్యాంకులో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో టీమిండియా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీనియర్ బౌలర్‌ని వరల్డ్ కప్ టోర్నీలో ఆడించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వన్డే క్రికెట్ జట్టులో స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, అక్షర పటేల్ కొనసాగుతున్నారు. అయినా మేనేజ్ మెంట్ చూపు అశ్విన్ వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ ఇప్పటివరకూ 113 వన్డేలు ఆడినప్పటికీ గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్లో చోటు లభించలేదు.
ఆసియా కప్ లో అశ్విన్ కు చోటు కల్పించాలని ప్లాన్
వెస్టిండీస్‌తో నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు కూడా అశ్విన్ దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ గరిష్టంగా 12 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 30 నుండి సెప్టెంబరు 17 వరకు ఆసియా కప్ జరగనుంది. ఒకవేళ ఆసియాకప్ లో అశ్విన్ కు చోటు లభిస్తే, ప్రపంచకప్ లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వన్డే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయడానికి ఇప్పటికే కసరత్తులను ప్రారంభించారు.