Page Loader
IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం  

IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు టీమిండియా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని, అలాగే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత స్థిరపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుండటంతో, భారత జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వివరాలు 

అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా?

కాన్పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ అదనపు స్పిన్నర్‌ను జట్టులో చేర్చే అవకాశముంది. ప్రత్యేక స్పిన్నర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా ఆడటం ఖాయమే. అయితే, మూడో స్పిన్నర్‌గా ఎవరిని ఎంచుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేస్తారా? లేక బ్యాటింగ్ బలోపేతం కోసం అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా? అన్నది చూడాలి. కుల్దీప్ జట్టులో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అదనపు స్పిన్నర్ జట్టులో చేరడం వల్ల ఒక పేసర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

వివరాలు 

బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు 

న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ దృష్ట్యా, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని సమాచారం. దాంతో, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తుది జట్టులో కొనసాగే అవకాశముంది. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. గిల్, కోహ్లీ, పంత్, రాహుల్‌లు వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. గిల్, పంత్, అశ్విన్ మొదటి టెస్టులో సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.