Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ. 57 లక్షలు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మధ్య అక్టోబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ హై ఓల్టోజ్ మ్యాచును చూడటానికి టికెట్ల కోసం ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం లక్షల రూపాయలు పెట్టేందుకు కూడా అభిమానులు వెనుకాడటం లేదు. దీన్ని అదునుగా చేసుకొని టికెట్ల ధరలను అమాంతంగా పెంచేసినట్లు తెలుస్తోంది. టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నా వాటి ధరలు చూసిన అభిమానులకు మాత్రం షాక్ తగులుతోంది. అయితే, ఒక్కో టికెట్ రూ.57 లక్షలు ఉండటం గమనార్హం. దీంతో క్రికెట్ అభిమానులు బీసీసీఐ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.
బీసీసీఐపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు
వయాగోగో వెబ్‌సైట్‌లో అతి తక్కువ టికెట్టు ధర రూ. 80 వేలు ఉండగా, ఇప్పటికే బుక్ మై షో పేరుతో ఉన్న టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో భారత మ్యాచుకు సంబంధించిన టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. మరోవైపు ఒక టికెట్ ను 15 లక్షలకు అమ్ముతున్నట్లు వయోగోగో యాప్‌లో చూశానని ఓ యూజర్ పేర్కొన్నాడు. సెకండరీ మార్కెట్ ద్వారా అమ్మే టికెట్లు అధిక ధరను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచుకు 41 వేల నుంచి 3 లక్షల వరకు అమ్మినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్, ఇండియా మ్యాచ్ టికెట్ ధర 2.3 లక్షలుగా ఉంది. ఈ టికెట్ల ధరలపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.