LOADING...
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..? 
: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..?

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
07:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమరానికి సిద్ధమైంది. టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఇటీవలి వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో మట్టికరిపించిన రోహిత్‌ శర్మ సేన,ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో అడుగుపెడుతోంది. ఈ తొలి మ్యాచ్ లో భారత్‌ ఫేవరేట్‌గా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం తగదు. సెమీఫైనల్‌ చేరేందుకు ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారనుంది. రో-కో దూకితే భారత్‌ విజయం ఖాయం! ఇటీవల తన ఫామ్‌ కోల్పోయి విమర్శల పాలైన రోహిత్‌ శర్మ, ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. అలాగే,స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ కూడా మళ్లీ రాణించడం టీమ్‌ఇండియాకు శుభపరిణామం. ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై వీరిద్దరూ రాణిస్తే, భారత్‌కు తిరుగుండదు.

వివరాలు 

జట్టు కూర్పు ఎలా ఉండొచ్చు? 

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌లో బంగ్లాపై రోహిత్‌-కోహ్లీల విజృంభణ అభిమానులు మరిచిపోలేరు. ఆ మ్యాచ్ లో రోహిత్‌ 123పరుగులు,కోహ్లీ 96పరుగులతో జయభేరి మోగించారు. ఈసారి కూడా అలాంటి ప్రదర్శన అభిమానులు ఆశిస్తున్నారు. వీరితో పాటు శుభమన్‌ గిల్ మెరుస్తే, టీమ్‌ఇండియా భారీ స్కోరు ఖాయం. భారతజట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండడంతో తుది జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జస్ప్రిత్‌ బుమ్రా గైర్హాజరీలో మహ్మద్‌ షమీ ఆధ్వర్యంలోని పేస్‌ దళం కీలకంగా మారనుంది. మరోవైపు రోహిత్‌ శర్మ-గౌతమ్‌ గంభీర్ ద్వయం ప్రత్యర్థిని కట్టడి చేయడానికి ప్రత్యేక వ్యూహాలు రచించనున్నారు. ఇక,బంగ్లాదేశ్‌ మహ్మదుల్లా,మిరాజ్,ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ లాంటి స్టార్లపై ఆశలు పెట్టుకుంది. ఈటోర్నీలో బంగ్లాదేశ్‌ పైన పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ,ఏదైనా జరిగే అవకాశం ఉంది.

వివరాలు 

భారత్‌ vs బంగ్లాదేశ్ - వన్డే గణాంకాలు 

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కు ముందు, భారత్‌ శ్రీలంకపై 0-2 తేడాతో ఓడి, ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్‌ 2024లో 9 వన్డేలు ఆడగా, కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో 0-3 తేడాతో ఘోర ఓటమి ఎదుర్కొంది. భారత్‌ - బంగ్లాదేశ్‌ మొత్తం 41 వన్డేలు ఆడగా, భారత్‌ 32 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌ కేవలం 8 విజయాలు నమోదు చేసింది, అయితే వాటిలో 3 చివరి 5 మ్యాచ్‌ల్లో వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్ 2023లో భారత్‌ బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్‌-బంగ్లాదేశ్‌ ఒక్కసారి మాత్రమే తలపడగా, 2017లో 9 వికెట్ల తేడాతో భారత్‌ గెలిచింది.