Page Loader
ICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి
భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి

ICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పాకిస్థాన్‌పై గెలుపుతో కోలుకున్న భారత జట్టు కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌పై విజయం సాధించడం మంచి విషయమే అయినా, నెట్ రన్ రేట్‌ను పెద్దగా మెరుగుపరుచుకోకపోవడం సమస్యగా మారింది. ఇవాళ శ్రీలంకపై కేవలం టీమిండియా గెలవడం కాకుండా, భారీ తేడాతో విజయం సాధించడం జట్టుకు చాలా అవసరం. చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో రన్‌రేట్ మెరుగుపర్చుకోవాలి. శ్రీలంకను సులభంగా ఓడించడంలో భారత్‌కు పెద్ద కష్టం లేదు, కానీ శ్రీలంక స్పిన్‌ బౌలింగ్ పటిష్టంగా కన్పిస్తోంది.

Details

 భారత జట్టు రన్‌రేట్‌పై ఆధారపడే అవకాశాలు

ఆస్ట్రేలియాపై గెలిచినప్పటికీ సెమీస్‌కు చేరడం నెట్ రన్‌రేట్‌పై ఆధారపడే అవకాశం ఉంది. ఈ కారణంగా, భారత్‌ శ్రీలంకపై భారీ తేడాతో గెలవడం కీలకం. ఇది జట్టుకు కంగారూలతో తలపడేందుకు మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. భారత్‌తో పోలిస్తే, శ్రీలంక బలహీన జట్టుగా కనిపిస్తుండవచ్చు. కానీ చమరి అట్టపట్టు నేతృత్వంలోని ఈ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దుబాయ్‌ పిచ్‌పై వారు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు ఉన్నాయి. చమరి ఒక అనుభవజ్ఞురాలు మాత్రమే కాకుండా, బౌలింగ్‌ కూడా అద్భుతంగా వేస్తుంది. కవీషా, సుగంధిక వంటి స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించవచ్చు.

Details

స్మృతి మంధాన మెరుగ్గా రాణించాలి

భారత బ్యాటర్లు గత రెండు మ్యాచ్‌ల్లో తమ స్థాయిని నిలబెట్టుకోలేకపోయారు. ముఖ్యంగా స్మృతి మంధాన ఇంకా రాణించాల్సి ఉంది. షెఫాలి, హర్మన్‌ప్రీత్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌లో నిలకడగా ఆడారు. కానీ భారత బ్యాటింగ్ లైనప్‌కు స్థిరత అవసరం. బౌలింగ్ విభాగంలో రేణుక, అరుంధతి చక్కగా రాణిస్తున్నారు. ఇక శ్రేయాంక, ఆశ కూడా పర్వాలేదనే చెప్పాలి. పూజ వస్త్రాకర్‌ ఆడేది లేనిది వైద్య సిబ్బంది నివేదికను బట్టి ఉంటుందని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు.

Details

ఇరు జట్లలోని సభ్యులు!

భారత్‌ జట్టు స్మృతి, షెఫాలి, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), జెమీమా, దీప్తి, రిచా, సజన/పూజ, శ్రేయాంక, ఆశ, అరుంధతి, రేణుక. శ్రీలంక జట్టు చమరి (కెప్టెన్‌), విష్మి, నీలాక్షిక, హర్షిత, హాసిని, కవీషా, అనుష్క, సుగంధిక, ఉదేశిక, ఇనోషి, సచిని. మొత్తంగా ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, శ్రీలంకపై కూడా ఘన విజయం సాధించడం మాత్రమే కాకుండా, రన్‌రేట్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా ఉంచుకోవాలి.