WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మొదట నుంచి జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినిపించాయి. టీమిండియా విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అలాంటి అతడిని కాదని ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజా వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. నలుగురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగడంతో అశ్విన్ కు చోటు లభించలేదు. తాజాగా ఈ వ్యవహారంపై అశ్విన్ స్పందించాడు. మ్యాచుకు ముందే తనను పక్కన పెట్టే విషయం తనకు తెలుసని, అయితే జట్టులో ఉంటే బాగుండేదని, టీమిండియా ఓడిపోవడం మాత్రం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.
విమర్శలను పట్టించుకోను : అశ్విన్
వరుసగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగుపెట్టడం అద్భుతమని, తాను ఫైనల్ మ్యాచులో ఆడి ఉంటే బాగుండేదని, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తాను నాలుగు వికెట్లు తీశానని 2018-19 సీజన్ నుంచి విదేశాల్లోనూ ఎక్కువగా వికెట్లు తీశానని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. టెస్టుల్లో ఎప్పుడైనా సరే నాలుగో ఇన్నింగ్స్ చాలా కీలకమని, అయితే స్పిన్నర్లను తట్టుకోవడం కష్టమని, ముఖ్యంగా ఓవల్ మైదానంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని మేనేజ్ మెంట్ నిర్ణయించిందని, దీంతో ఏకైక స్పిన్నర్ గా జడేనాను తీసుకున్నారు. బయటి నుంచే విమర్శలను పట్టించుకోనని, ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే దానిపై ఆలోచించేంత స్టేజ్ లో తన కెరీర్ లేదని, ఎవరూ తనను జడ్జ్ చేసినా తనకు అనవసరమని అశ్విన్ చెప్పుకొచ్చాడు.