Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా (Team India) అద్భుతంగా రాణించింది. ఆదివారం జరిగిన మ్యాచులో భారీ స్కోరు చేసిన భారత్, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసింది. ఈ మ్యాచులో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా సెన్సేన్ యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఈ మ్యాచులో 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం యశస్వీ మాట్లాడారు. తొలి టీ20లో రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) రనౌట్ అవడం గురించి యశస్వీ జైస్వాల్ గుర్తు చేసుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్, వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు
తొలి ఓవర్ ఐదో బంతికి సింగిల్ తర్వాత, రుతురాజ్‌ను రెండో పరుగుకు యశస్వి పిలిచాడు. రుత్ రాజ్ ముందుకొచ్చాడు. ఆ సమయంలో యశస్వి పరుగు కోసం రాకుండా ఆగిపోయాడు. దీంతో రుత్ రాజ్ రనౌట్ అయి నిరాశగా వెనుతిరిగాడు. ఈ మ్యాచులో తప్పు అంతా తనదేనని, అందుకే రుతురాజ్ కు క్షమాపణ చెప్పానని యశస్వీ వెల్లడించారు. ఇక తాను భయం లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని యశస్వి పేర్కొన్నాడు. రేపు గౌహతిలో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది.