Page Loader
IPL 2025: 'కేఎల్ రాహుల్ - గోయెంకా' ఎపిసోడ్‌ రీక్రియేట్.. పంత్‌తో గోయెంకా సంభాషణ వైరల్!
'కేఎల్ రాహుల్ - గోయెంకా' ఎపిసోడ్‌ రీక్రియేట్

IPL 2025: 'కేఎల్ రాహుల్ - గోయెంకా' ఎపిసోడ్‌ రీక్రియేట్.. పంత్‌తో గోయెంకా సంభాషణ వైరల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Super Giants) సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించినప్పటికీ,తమ సొంత మైదానంలో మాత్రం ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. అయితే, మ్యాచ్‌ అనంతరం లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా,కెప్టెన్ రిషభ్ పంత్‌ (Rishabh Pant) మధ్య జరిగిన సంభాషణ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పునరావృతం కావడంతో 'కేఎల్ రాహుల్ - గోయెంకా' ఎపిసోడ్‌ మళ్లీ తలెత్తిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ గోయెంకా, పంత్‌తో చర్చిస్తున్న వీడియోలు బయటకు రావడంతో, ప్రతి మ్యాచ్‌ అనంతరం ఓనర్‌ కెప్టెన్‌తో ఇలా మాట్లాడటానికి అవసరం ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వివరాలు 

కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చడం అవసరమా?

కోచ్‌లు ఉన్నప్పుడు, ఈ విధంగా కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చడం అవసరమా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేఎల్ రాహుల్ విషయంలోనూ గోయెంకా ఇదే విధంగా ప్రవర్తించారని, ఇది మరోసారి నిరూపితమవుతోందని గుర్తు చేస్తున్నారు. కెప్టెన్‌కు స్వేచ్ఛ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ఇతర ఫ్రాంచైజీల ఓనర్లు ఇలాంటి వ్యవహారాన్ని ప్రదర్శించరని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

"మేం 25 పరుగులు తక్కువ చేశాం" - రిషభ్ పంత్ 

''పంజాబ్‌కు నిర్దేశించిన లక్ష్యం సరిపోలేదు. కనీసం 25 పరుగులు అదనంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆటలో సహజమైన విషయాలే. మా సొంత మైదానంలో పిచ్‌ పరిస్థితులను పూర్తిగా అంచనా వేయాలి. వికెట్లు త్వరగా కోల్పోతే, పెద్ద స్కోరు చేయడం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. పిచ్‌ మందకొడిగా ఉన్నప్పుడు స్లో బంతులను వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అంతకుమించి నేను చెప్పలేను,'' అని పంత్ వ్యాఖ్యానించాడు.