Page Loader
Manika Batra: అర్జెంటీనాలో  వరల్డ్ టేబుల్ టెన్నిస్‌ టోర్నీ.. ముంబైలో చిక్కుకున్న మానికా బాత్రా
అర్జెంటీనాలో వరల్డ్ టేబుల్ టెన్నిస్‌ టోర్నీ.. ముంబైలో చిక్కుకున్న మానికా బాత్రా

Manika Batra: అర్జెంటీనాలో  వరల్డ్ టేబుల్ టెన్నిస్‌ టోర్నీ.. ముంబైలో చిక్కుకున్న మానికా బాత్రా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనాలో మంగళవారం ప్రారంభం కానున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి బయలుదేరాల్సిన భారత టేబుల్ టెన్నిస్‌ స్టార్‌ మనికా బాత్రా ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం రద్దు కావడంతో నేడు దోహా వెళ్లలేక ముంబయి ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయినట్లు ఆమె స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తాను విమానయాన సంస్థను సంప్రదించినా.. తన పరిస్థితి తీవ్రత తెలిసినప్పటికీ సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు 

 టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతానని బాధ

దోహా వరకు వెళ్లే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అత్యవసరంగా ఏర్పాటు చేసి తనను పంపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో అర్జెంటీనాకు వెళ్లి టోర్నీలో పాల్గొనదగిన అవకాశం కల్పించాలని మనిక తెలిపారు. తాను భారత్‌ తరఫున వరల్డ్ టేబుల్ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్నానని గుర్తు చేస్తూ.. తనకు సహాయం చేయాలని భారత ప్రధాని కార్యాలయానికి (PMO), కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు,కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయలకు విజ్ఞప్తి చేశారు. ఆలస్యం అయితే టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతానని బాధను వ్యక్తం చేశారు.

వివరాలు 

ఆసియా కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళా ప్లేయర్‌గా బాత్రా

ఇక మనికా బాత్రా.. ఆసియా కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళా ప్లేయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2020లో భారత ప్రభుత్వం మనికాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుతో సత్కరించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో 16వ రౌండ్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. అయితే ఆ రౌండ్‌లో జపాన్‌కు చెందిన మియూ హిరానో చేతిలో ఐదు గేమ్‌ల్లో ఓటమి పాలయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మానికా బాత్రా చేసిన ట్వీట్