Page Loader
Matthew Breetzke:మాథ్యూ బ్రీట్జ్‌కే సంచలనం.. వన్డే క్రికెట్‌లో అద్భుత రికార్డు 
మాథ్యూ బ్రీట్జ్‌కే సంచలనం.. వన్డే క్రికెట్‌లో అద్భుత రికార్డు

Matthew Breetzke:మాథ్యూ బ్రీట్జ్‌కే సంచలనం.. వన్డే క్రికెట్‌లో అద్భుత రికార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య వన్డే ఫార్మాట్‌లో ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా సోమవారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే అరంగేట్రం చేశాడు. 26 ఏళ్ల బ్రీట్జ్‌కే తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతడు 148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా బ్రీట్జ్‌కే ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డెస్మండ్ హేన్స్ పేరిట ఉండేది.

Details

ఐపీఎల్‌లో లఖ్‌నవూ తరఫున ఆడనున్న బ్రీట్జ్‌కే

అతడు 1978లో ఆస్ట్రేలియాపై 148 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రీట్జ్‌కే విధ్వంసకర బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. అతడికి వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) మంచి సహకారం అందించారు. బ్రీట్జ్‌కే ఐపీఎల్ 2025 సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. ఎల్‌ఎస్‌జీ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

Details

వన్డేల్లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు 

1. మాథ్యూ బ్రీట్జ్‌కే (సౌతాఫ్రికా) - 150 (న్యూజిలాండ్‌పై, 2025) 2. డెస్మండ్ హేన్స్‌ (వెస్టిండీస్) - 148 (ఆస్ట్రేలియాపై, 1978) 3. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (అఫ్గానిస్థాన్) - 127 (ఐర్లాండ్‌పై, 2021) 4. మార్క్ చాప్‌మన్ (హాంకాంగ్‌) - 124* (యూఏఈపై, 2015) 5. కోలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా) - 124 (జింబాబ్వేపై, 2010)