Mohammed Shami: మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్? ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత క్రికెట్ జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది. అయితే పింక్ బాల్ టెస్టులో ఎదురైన ఘోర పరాజయం తర్వాత బ్యాటింగ్ విభాగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో జట్టులో బౌలింగ్ దాడి మరింత బలపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కీలకమైన పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, షమీ ఇటీవల ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నప్పటికీ, అతడు పూర్తి స్థాయి టెస్టు మ్యాచ్ ఫిట్‌నెస్‌ను సాధించలేదని తెలుస్తోంది. ఈ పరిణామం భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు టెస్టులలో అతడు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలొస్తున్నాయి.
షమీ కోసం తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి
ఇటీవల షమీ బెంగాల్ టీ20 జట్టుతో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసినప్పుడు మోకాలి వాపు సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. షమీ మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడని, అతడు చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నారని తెలిపారు. అందుకే తాము అతడిపై ఒత్తిడి తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని, నిపుణులు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని, కానీ జట్టులో అతడి కోసం తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వెల్లడించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ లో షమీ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, అతడి ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లలో సందేహాలు ఉన్నట్లు సమాచారం.