LOADING...
Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..!
టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..!

Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత జట్టు మొత్తం ఐదు టెస్ట్ మ్యాచులు ఆడనుంది. ఈ కీలక సిరీస్‌కు ముందు జట్టులో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను, క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి వెంటనే ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు కొన్ని వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై మహమ్మద్ షమీ తీవ్రంగా స్పందించాడు. తన భవిష్యత్తును తప్పుడు వార్తలతో పాడుచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

వివరాలు 

బాగుంది మహరాజ్‌..

ఒక ప్రముఖ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం ప్రకారం షమీ కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని పేర్కొనగా, దీనిపై షమీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా కౌంటర్ ఇచ్చాడు. ఆ కథనాన్ని స్క్రీన్‌షాట్ రూపంలో షేర్ చేస్తూ, "బాగుంది మహరాజ్‌. మీరు చేసే ఉద్యోగానికి చివరి రోజులు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోండి. మేము ఎదగడానికి, మా భవిష్యత్తు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నపుడే మీలాంటి వాళ్లు అడ్డుపడుతున్నారు. ఆటగాళ్ల గురించి ఒకసారి కూడా సానుకూలంగా ఆలోచించండి. ఈ రోజు మీరు రాసిన కథనం దారుణమైనది. సారీ అని అనుకోకండి,"అని షమీ మండిపడ్డాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.షమీకి మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

వివరాలు 

ఇంగ్లాండ్‌ టూర్ కు త్వరలో జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

ఫేక్ న్యూస్ రాసే వారికి సమర్థవంతంగా జవాబిచ్చిన షమిని అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా, షమీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఈసారి ఐపీఎల్ జూన్ 3న ముగియనుంది. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌లో పాల్గొననుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ త్వరలో జట్టును ప్రకటించనుంది. టెస్ట్ కెప్టెన్‌ను కూడా ఆ సమయంలో ప్రకటించనున్నారు. శుభ్‌మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్ల పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే, ఈ పర్యటనకు సీనియర్ పేసర్ మహమ్మద్ షమిని ఎంపిక చేస్తారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

వివరాలు 

ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నషమీ

34 ఏళ్ల మహమ్మద్ షమీ ఇప్పటివరకు 64 టెస్ట్ మ్యాచ్‌లలో 122 ఇన్నింగ్స్ ఆడి మొత్తం 229 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో షమీ ఆరు సార్లు ఐదు వికెట్లను సాధించాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన షమీ,భారత తరఫున 108 వన్డే మ్యాచ్‌ల్లో 206 వికెట్లు పడగొట్టగా, 25 టీ20ల్లో 27 వికెట్లు తీసాడు. అయితే, ఇటీవల షమీ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా ఆటకు కొంతకాలం దూరమయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి ముందు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడుతున్నా,ఫామ్ కొరతతో తడబడుతున్నాడు. అయినప్పటికీ,షమీ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మండిపడ్డ మహ్మద్‌ షమీ..!