ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్
ఒకప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి క్రమంగా తగ్గిపోయింది. దీనికి కారణం ఇరు జట్ల మధ్య మ్యాచులు జరగకపోవడేనని చెప్పొచ్చు. తాజాగా ఆసియా కప్‌లోనూ భారత్ ఆడే మ్యాచులు ఆతిథ్యం దేశం పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడుతోంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ పై భారత ప్రభుత్వం కీలక వ్యాఖ్యలను చేసింది. ఉగ్రవాదాన్ని ఆపేవరకూ పాకిస్థాన్ క్రికెట్ తో ఎటువంటి క్రీడా కార్యక్రమాలు ఉండవని స్పష్టం చేసింది.
ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలి
ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ కి చెందిన ఆర్మీ కల్నల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరణించిన తర్వాత భారత్ పాక్ క్రికెట్ మ్యాచులపై మరోసారి దేశంలో చర్చ మొదలైంది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అరికట్టేవరకు భారత్- పాక్‌ల మధ్య దైపాక్షిక క్రికెట్ మ్యాచులు ఉండవని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఉండవని, ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అక్టోబరులో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబరు 14న పాక్‌తో భారత్ తలపడుతున్న విషయం తెలిసిందే.