LOADING...
Pakistan: ఒలింపిక్స్‌ 2028.. పాక్‌ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ ..?
ఒలింపిక్స్‌ 2028.. పాక్‌ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ ..?

Pakistan: ఒలింపిక్స్‌ 2028.. పాక్‌ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ ..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు 2028 ఒలింపిక్స్‌ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. లాస్‌ ఏంజెలెస్‌లో జరగనున్న ఆ ఒలింపిక్స్‌కు పాకిస్థాన్‌ పురుషుల జట్టు అనర్హత ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, మరో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్‌ కూడా ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యే అవకాశముంది. ఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇటీవల సింగపూర్‌ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా, ఒలింపిక్స్‌ కోసం అర్హత ప్రమాణాలను ఖరారు చేశారు. దీనిపై 'గార్డియన్‌' ప్రచురించిన నివేదిక ప్రకారం, జట్లు ప్రాంతీయ అర్హతల ఆధారంగా ఒలింపిక్స్‌కు ఎంపిక అవుతాయని నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

ప్రతి రీజియన్‌కు ఒకే ఒక చోటు 

ఈ నిర్ణయం ప్రకారం, ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు జట్లు మాత్రమే పాల్గొననున్నాయి. ఆసియా, ఓషియానియా, యూరప్‌, ఆఫ్రికా వంటి ప్రధాన ఖండాల నుంచి ఒక్కో అగ్రశ్రేణి జట్టుకు స్థానం లభిస్తుంది. అమెరికా ఆతిథ్య దేశంగా ఉన్నందున, ప్రత్యక్షంగా ఆ జట్టుకు ఒలింపిక్స్‌ స్థానం లభించే అవకాశం ఉంది.

వివరాలు 

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత జట్లు 

ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే, ఆసియా నుంచి భారత్‌ టాప్‌లో ఉంది. ఓషియానియాలో ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్‌లో ఇంగ్లాండ్‌ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అమెరికా ప్రత్యక్షంగా అర్హత పొందితే, వెస్టిండీస్‌ జట్టుకు అవకాశాలు తగ్గుతాయి. ఆరో జట్టును ఎలా ఎంపిక చేస్తారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ అన్ని ఖండాలకు ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో, ఒక్కో రీజియన్‌కు ఒక్కో సీటు ఇవ్వాలనే యోచనపై ఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

వివరాలు 

పాక్‌, న్యూజిలాండ్‌ నిరుత్సాహం 

ఈ నేపథ్యంలో, టీ20 ర్యాంకింగ్స్‌ను గమనిస్తే, పాకిస్థాన్‌ ఎనిమిదో స్థానంలో, శ్రీలంక ఏడో స్థానంలో ఉన్నాయి. ఓషియానియాలో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉంది. దీంతో, తాజా నిర్ణయాలతో ఈ రెండు జట్లు ఒలింపిక్స్‌ రేసులోంచి బయట పడే ప్రమాదంలో పడ్డాయని 'గార్డియన్‌' నివేదిక స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రతిపాదనను ఇంకా అధికారికంగా ఐసీసీ బోర్డు ఆమోదించలేదు. కానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

వివరాలు 

అమెరికా జట్టుపై కూడా సందిగ్ధత 

మరోవైపు, యూఎస్‌ ఒలింపిక్‌,పారాలింపిక్‌ కమిటీ నుండి అమెరికా జట్టు నేషనల్‌ గవర్నింగ్‌ బాడీగా గుర్తింపు పొందలేనట్లయితే, ఆ జట్టుపై కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌ చార్టర్‌ ప్రకారం, ఈ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. అయినప్పటికీ, గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌ 8 దశలో పాకిస్థాన్‌ను ఓడించి యూఎస్‌ జట్టు సంచలనాన్ని సృష్టించిన విషయం మరవలేం. ఇది వారి క్రికెట్‌ అభివృద్ధిలో మైలురాయిగా నిలిచింది. మహిళల జట్ల అర్హత ఇక మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌ ఆధారంగా నిర్వహించే ఒలింపిక్స్‌ టోర్నీకి అర్హతలను వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫలితాల ఆధారంగా నిర్ణయించనున్నారు. అదే ఆధారంగా టోర్నీలో పాల్గొనే జట్లు ఎంపికవుతాయి.

వివరాలు 

128 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్‌ పునరాగమనం 

128 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో మరోసారి చోటు లభించింది. 2028లో జరగనున్న లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో పురుషులు, మహిళల క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. గతంలో 1900లో ఒక్కసారే క్రికెట్‌ ఒలింపిక్స్‌లో ఆడిన సందర్భం ఉంది. అప్పుడు బ్రిటన్‌కు చెందిన డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌, ఫ్రాన్స్‌కి చెందిన ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ మధ్య మ్యాచ్‌ జరగగా, బ్రిటన్‌ విజయం సాధించింది.