వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్-కోహ్లీ
వెస్టిండీస్, టీమిండియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 27న బార్బడోస్‌లో జరగనుంది. ఇప్పటికే వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన్ చూస్తోంది. ప్రస్తుతం ఈ వన్డే సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారీ రికార్డులపై కన్నేశారు.
అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్-కోహ్లీ
ఇప్పటివరకూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేఫార్మాట్లో 4998 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు మరో రెండు పరుగులను సాధిస్తే వన్డే ఫార్మాట్లో ఐదు వేల పరుగుల భాగస్వామ్యంతో మరో గొప్ప రికార్డును సృష్టించనున్నారు. 85 వన్డేల్లో ఈ ఇద్దరూ కలిసి 4998 పరుగులను జోడించారు. అయితే వన్డే ఫార్మాట్లో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య 15 సార్లు సెంచరీ భాగస్వామ్యం, 18 సార్లు యాబైకి పైగా పరుగులను జోడించారు. రోహిత్ ఇప్పటివరకూ 243 వన్డేల్లో 10914 పరుగులను చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలున్నాయి. విరాట్ కోహ్లీ 274 వన్డేల్లో 13,776 పరుగులను చేశాడు. ఇందులో 46 సెంచరీలను బాదాడు.