
ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మహా టోర్నీ జరగనుంది.
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది.
పాకిస్థాన్ మహిళల జట్టు ఫాతిమా సనా నాయకత్వంలో ఈప్రపంచకప్‌కు అర్హత పొందింది.
క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 87 పరుగుల తేడాతో ఓడించి పాక్ జట్టు మెగా టోర్నీలోకి ప్రవేశించింది.
క్వాలిఫయర్ దశలో పాక్ నాలుగు మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ విజయం సాధించింది.
ఈ విజయాలతో పాక్ 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌కి అర్హత సాధించిన నేపథ్యంలో టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఐసీసీ యోచనలో ఉంది.
అయితే,పాకిస్థాన్ జట్టు పాల్గొనే మ్యాచ్‌లు ఏదేశంలో నిర్వహించబడతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
వివరాలు
వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా మెగా టోర్నీలో
ఈ మెగా టోర్నీలో భారత్ ఆతిథ్య దేశంగా పాల్గొననుండగా, ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచి నేరుగా అర్హత సాధించాయి.
క్వాలిఫయర్స్‌లో విజయం సాధించి పాకిస్థాన్ అర్హత పొందగా,మరో స్థానం కోసం బంగ్లాదేశ్,వెస్టిండీస్, స్కాట్‌లాండ్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇక మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా, భద్రతా సమస్యల నేపథ్యంలో బీసీసీఐ తమ జట్టును పాక్‌కు పంపలేమని ఐసీసీకి స్పష్టంగా తెలిపింది.
దీనిపై చర్చల అనంతరం,ఐసీసీ సమక్షంలో బీసీసీఐ, పీసీబీ మధ్య హైబ్రిడ్ మోడ్ అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు,భవిష్యత్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తటస్థ వేదికలపైనే తలపడే అవకాశముంది.
వివరాలు
పాక్ ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్, శ్రీలంక లేదా యూఏఈలో..
ఇప్పుడు పాకిస్థాన్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025కు అర్హత సాధించిన నేపథ్యంలో, భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కూడా హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్నారు.
పాక్ ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్, శ్రీలంక లేదా యూఏఈలో ఏ వేదికపై నిర్వహించనున్నారన్నది త్వరలో తేలనుంది.