LOADING...
Asia Cup: ఆట ముందు పాకిస్థాన్ జట్టు డ్రామా.. యూఏఈతో మ్యాచ్‌ గంట ఆలస్యం
ఆట ముందు పాకిస్థాన్ జట్టు డ్రామా.. యూఏఈతో మ్యాచ్‌ గంట ఆలస్యం

Asia Cup: ఆట ముందు పాకిస్థాన్ జట్టు డ్రామా.. యూఏఈతో మ్యాచ్‌ గంట ఆలస్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌, యూఏఈ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్‌కు ముందు అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరచాలనం వివాదంపై మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలన్న పాకిస్థాన్‌ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించడంతో, ఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్‌ సిద్ధమైనట్లు వార్తలు రావడం కలకలం రేపింది. అయితే చివరకు పైక్రాఫ్ట్‌ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించడంతో ఆటగాళ్లు మైదానంలోకి ప్రవేశించారు. ఫలితంగా మ్యాచ్‌ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ఆరంభమైంది.

వివరాలు 

మ్యాచ్‌ అనంతర కార్యక్రమాలకు, విలేకరుల సమావేశానికి హాజరు కానీ అఘా మ్యాచ్‌

గత ఆదివారం భారత్‌తో జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పహల్గాం దాడి నేపథ్యంలో టాస్‌ సమయంలో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ ప్రత్యర్థి కెప్టెన్‌ సల్మాన్‌ అఘాకు కరచాలనం చేయలేదు. మ్యాచ్‌ అనంతరం కూడా టీమిండియా ఆటగాళ్లు పాక్‌ క్రికెటర్ల వద్దకు రాకపోవడంతో, వారు దీనిని అవమానంగా భావించారు. ఫలితంగా కెప్టెన్‌ అఘా మ్యాచ్‌ అనంతర కార్యక్రమాలకు, విలేకరుల సమావేశానికి హాజరు కాలేదు. ఈ క్రమంలో టాస్‌ సందర్భంగా కరచాలనం అవసరం లేదని రిఫరీ పైక్రాఫ్ట్‌ చెప్పాడని ఆరోపిస్తూ, అతడిని విధుల నుంచి తప్పించాలని పాకిస్థాన్‌ డిమాండ్‌ చేసింది. కానీ ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది.

వివరాలు 

రిఫరీ క్షమాపణ చెప్పాడన్న పీసీబీ 

ఇదే కారణంగా పాకిస్థాన్‌ ఒక దశలో ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. బుధవారం యూఏఈతో మ్యాచ్‌ ముందు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6.30కి మ్యాచ్‌ మొదలవ్వాల్సి ఉండగా, ఆటగాళ్లు 4.30కి స్టేడియంలో ఉండాలి. యూఏఈ జట్టు సమయానికి రాగా,పాక్‌ ఆటగాళ్లు గంట గడిచినా స్టేడియానికి రాలేదు. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు ఏసీసీ అధ్యక్షుడిగాను, పీసీబీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్న మోసిన్‌ నఖ్వి జోక్యం చేసుకోవడంతో సాయంత్రం 5.45కు పాక్‌ జట్టు హోటల్‌ నుంచి బయల్దేరింది. పైక్రాఫ్ట్‌ తమ కెప్టెన్‌, మేనేజర్‌లకు క్షమాపణ చెప్పాడని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చిందని పీసీబీ స్పష్టంచేసింది.

వివరాలు 

పైక్రాఫ్ట్‌ లేదా ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

పైక్రాఫ్ట్‌ క్షమాపణ తెలిపిన తర్వాతే తమ ఆటగాళ్లు మైదానానికి వెళ్లారని పీసీబీ సంకేతాలు ఇచ్చింది. ఈ అన్ని నాటకీయ పరిణామాల మధ్య పాక్‌-యూఏఈ మ్యాచ్‌ ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పీసీబీ ప్రకటనలో పైక్రాఫ్ట్‌ క్షమాపణ చెప్పాడని తెలిపినా, పైక్రాఫ్ట్‌ లేదా ఐసీసీ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పైక్రాఫ్ట్‌ మాత్రం కేవలం సమాచార లోపం విషయంలోనే క్షమాపణ చెప్పాడని ఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.