ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి 100 పతకాలు
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రీడల్లో మొదటిసారిగా 100 పతకాలను కైవసం చేసుకుంది. శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో గోల్డ్ మెడల్ లభించడంతో ఈ ఘనతను అందుకుంది. భారత పేరిట 2010లో 65, 2014లో 57, 2018లో 70 పతకాలు మాత్రమ ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్రీడల్లో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో భారత్ పతకాల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 354 మెడల్స్‌తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం
మహిళల కబడ్డీ ఫైనల్లో భారత్ 26-25తో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు ఆర్చరీలో ఇండియాకు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్‌లో ఓజాస్ ప్రవీణ్ డియోటలేకు స్వర్ణం గెలుచుకోగా, అభిషేక్ వర్మ సిల్వర్ సాధించాడు. ఆసియా క్రీడల్లో ఓజాస్‌కు ఇది మూడోవ బంగారు పతకం కావడం విశేషం. ఆర్చరీ మహిళల కాంపౌండ్‌లో భారత స్టార్ వెన్నమ్ జ్యోతి సురేఖ 149-145తో కొరియాపై విజయం సాధించింది. దీంతో ఆర్బరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్ లో జ్యోతి సురేష్ స్వర్ణం గెలుపొందింది. ఇక అదితి గోపిచంద్ కాంస్యం గెలుచుకుంది.
పతకాల పట్టికలో అగ్రస్థానంలో చైనా
మెన్స్ కాంపౌండ్ ఫైనల్‌లో స్వర్ణం కోసం ఇద్దరు భారత ఆర్చర్లు తలపడ్డాయి. అయితే 149 పాయింట్లతో అభిషేక్ శర్మపై పైచేయి సాధించిన ఓజాస్ ప్రవీణ్ డియోటలే స్వర్ణం సొంతం చేసుకున్నారు. ఇక 147 పాయింట్లతో అభిషేక్ శర్మ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పతకాల పట్టికలో 354 మెడల్స్‌తో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 187 స్వర్ణాలు, 104 రజతం, 63 కాంస్యాలు ఉన్నాయి. 169 మెడల్స్‌తో జపాన్ (47 గోల్డ్, 57 సిల్వర్, 65 బ్రోన్జ్), 171 పతకాలతో కొరియా (36 స్వర్ణం, 50 రజతం, 85 కాంస్యం), 100 మెడల్స్‌తో భారత్ తర్వాతి స్థానాల్లో ఉంది.
ఆటగాళ్లకు అభినందనలు : మోదీ
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు వంద మెడల్స్ సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక మైలురాయి అందుకున్న ఆటగాళ్లకు హృదయపూర్వక అభినందనలని, ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సాధించిన ఘనతతో దేశ ప్రజల హృదయాలు గర్వంలో నిండిపోయాయని చెప్పారు. ఈనెల 10న క్రీడాకారులతో మాట్లాడటానికి తాను ఎదురుచూస్తానని మోదీ ట్విట్ చేశాడు.