Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు యాషెస్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. మరోపక్క ఇంగ్లండ్ జట్టు తమ సొంతగడ్డపై జరిగే ఈ పోరులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కు ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇండియాపై సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్ ఈ సిరీస్ కూడా పరుగుల వరద పారించాలని భావిస్తున్నాడు. యాషెస్ సిరీస్ లో డేవిడ్ వార్నర్ ఫామ్ లోకి వస్తాడని సెలెక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లండ్ గడ్డపై స్మిత్ కు అద్భుత రికార్డు
ఇంగ్లండ్ గడ్డపై స్టీవ్ స్మిత్ 16 టెస్టులు ఆడి 1727 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు, రెండుడబుల్ సెంచరీలు ఉన్నాయి. డేవిడ్ వార్న్ 14 టెస్టులు ఆడి 25.74 సగటుతో 695 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2019లో యాషెస్ టెస్టు సిరీస్ లో స్మిత్ 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఒక ద్వైపాక్షిక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్ గా అప్పట్లో స్మిత్ నిలిచాడు. వార్నర్ కేవలం 95 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మొత్తంగా స్మిత్ 97 టెస్టుల్లో 8,947 పరుగులు చేసి ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.