Washington Sundar: ప్రతి సమస్యకీ సుందరే పరిష్కారమా? :టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ పరాజయం అనంతరం భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా స్పందించాడు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) ను పక్కనబెట్టి, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్(Washington Sundar) కు అవకాశమివ్వడాన్ని ప్రశ్నించాడు. గంభీర్ ప్రతి సమస్యకూ వాషింగ్టన్ సుందర్ నే పరిష్కారంగా భావిస్తున్నట్టుగా ఉందని మంజ్రేకర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
వివరాలు
భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడలేకపోతున్నారు: మంజ్రేకర్
"ఆయుర్వేదంలో కొన్ని మందులను తలనొప్పికి, కడుపు నొప్పికి కూడా సర్వరోగ నివారిణిలా వాడతారు.కానీ ఇక్కడ గంభీర్ కూడా అలాగే వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. బ్యాటింగ్‌లో లోపమా? వాషింగ్టన్ సుందర్! బౌలింగ్‌లో సమస్యా? మళ్లీ వాషింగ్టన్ సుందర్! అని చూస్తున్నారు. అంతేకాదు, అతడిని ఐదో స్థానానికి పైకి పంపి,అతని తర్వాత రింకు సింగ్, హార్దిక్ పాండ్యలను బ్యాటింగ్‌కు దింపడం సరైన వ్యూహం కాదు" అని మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ఫాస్ట్ బౌలింగ్‌పై కాకుండా, నెమ్మదిగా వచ్చే బంతులను ఎలా ఎదుర్కోవాలో సాధన చేయాలి. భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌కు స్లో డెలివరీల విషయంలో ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు.
వివరాలు
వైస్ కెప్టెన్‌ను ఎవరైనా జట్టులోంచి తప్పిస్తారా?: కృష్ణమాచారి శ్రీకాంత్
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను జట్టులోనుండి తప్పించడం మరో మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ను కూడా ఆగ్రహానికి గురి చేసింది. వైస్ కెప్టెన్ స్థానంలో ఉన్న ఆటగాడిని పక్కనబెట్టి ప్రయోగాలు చేయడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. "గౌతమ్ గంభీర్ ఏమి ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక బాధ్యత అతడిదే కదా. ఈ తరహా నిర్ణయాలతో ముందుకెళితే జట్టుకు నష్టం తప్పదు. ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమి అనంతరం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుకున్నారని చెబుతున్నారు. కానీ అక్షర్ పటేల్‌ను తప్పించిన తర్వాత చెప్పుకోవడానికి ఇంకేముంది?" అని శ్రీకాంత్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు.
వివరాలు
వైస్ కెప్టెన్‌గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు: శ్రీకాంత్
"ప్రధాన కోచ్‌గా గంభీర్ ఉన్నాడు. అతని చుట్టూ సహాయక కోచింగ్ సిబ్బంది ఉన్నారు. సాధారణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి లేదా? వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను ఇలా బయటకు పంపడం ఎలా సమర్థించగలం? ఇదే విధంగా గతంలో శుభమన్ గిల్ విషయంలోనూ వ్యవహరించారు. ఈ పరిస్థితులు కొనసాగితే, భవిష్యత్తులో టీ20ల్లో వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే ఆ హోదాలో ఉన్నవారినే జట్టులోంచి తొలగిస్తున్నట్టు భావన కలుగుతోంది" అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు.