
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. భారత టెస్ట్ కెప్టెన్ అతడేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో మరో కీలక అధ్యాయం ముగిసింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత, జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందున్న అతిపెద్ద సవాలు.
గతంలో సౌరబ్ గంగూలీకి రాహుల్ ద్రావిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ వంటి సమర్థులైన వారసులు సిద్ధంగా ఉన్న సందర్భాలు చూశాం.
కానీ, రోహిత్ తర్వాత ఆ పరంపర నిలవలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
33 ఏళ్ల వయసులో జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్, మహేంద్ర సింగ్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ తరహాలో దీర్ఘకాలం నాయకత్వం వహించలేడని అప్పట్లోనే ఊహించారు.
అయినప్పటికీ, దాదాపు నాలుగు సంవత్సరాలు జట్టును విజయవంతంగా నడిపించిన అతని నాయకత్వాన్ని అభినందించాల్సిందే.
వివరాలు
స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా నాలుగు నెలలు క్రికెట్‌కు దూరమైన బుమ్రా
రోహిత్ నిష్క్రమణ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడం బీసీసీఐకి తలనొప్పిగా మారింది.
కొద్ది నెలల క్రితం వరకూ జస్ప్రీత్ బుమ్రా జట్టు తర్వాతి కెప్టెన్‌గా ఎంపికవుతాడనే అభిప్రాయం ఉండేది.
కానీ, స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా నాలుగు నెలలు క్రికెట్‌కు దూరమైన అతడి ఫిట్‌నెస్ అంశం ఇప్పుడు అతనిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది.
తరచూ గాయాల బారిన పడే ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ తరుణంలో, కెప్టెన్ రేసులో ముందున్న మరో పేరు శుభమన్ గిల్. 25 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మన్ మంచి టాలెంట్ ఉన్నవాడు, దీర్ఘకాలిక భవిష్యత్తు ఉన్నవాడు.
వివరాలు
గిల్ భారత్‌లో అతడు నిలకడగా రాణించినా..
బీసీసీఐ అతన్ని భవిష్యత్తు కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని గత సంవత్సరం నుంచి కనిపిస్తోంది.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను విజయవంతంగా నడిపించిన తీరు, జట్టును పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంచిన తీరు అతని నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.
జట్టులో గిల్‌కు మంచి మద్దతు ఉంది. గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ ఆశిష్ నెహ్రా అతనిపై మంచి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే, గిల్ కెప్టెన్సీ అవకాశాలపై ప్రధానంగా ప్రభావం చూపుతోన్న అంశం.. అతని విదేశీ ప్రదర్శన.
భారత్‌లో అతడు నిలకడగా రాణించినా, విదేశాల్లో మాత్రం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు.
దేశీయంగా 32 టెస్టుల్లో 1893 పరుగులు చేసి, సగటు 35తో ఐదు సెంచరీలు చేసిన గిల్ మంచి స్థిరత్వాన్ని ప్రదర్శించాడు.
వివరాలు
స్వింగ్ బంతులు ఆడడంలో తడబడుతున్న గిల్
కానీ, విదేశాల్లో ఆడిన 13 టెస్టుల్లో కేవలం 649 పరుగులే చేయడం,అతని నాయకత్వ ఆశలకు అడ్డు కావచ్చు.
గిల్ విదేశాల్లో చేసిన ఏకైక సెంచరీ (110 పరుగులు)బంగ్లాదేశ్‌లో ఛటోగ్రామ్ టెస్టులో వచ్చింది.
అది కాకుండా, విదేశాల్లో మరో రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేసిన గిల్, 2021 ఆస్ట్రేలియా టూర్‌లో గబ్బాలో 91, మెల్‌బోర్న్‌లో 50 పరుగులతో రాణించాడు.
అయితే, ఆ తర్వాత స్వింగ్ బంతులు ఆడడంలో తడబడుతూ స్థిరత్వాన్ని కోల్పోయాడు.
త్వరలో జరగబోయే ఇంగ్లండ్ పర్యటన గిల్ కెరీర్‌కు మైలురాయి కావొచ్చు.
బ్యాటింగ్ లైనప్‌లో సీనియర్ ఆటగాడిగా అతను కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఇక బుమ్రా విషయానికి వస్తే.. అతను ఇప్పటి వరకూ మూడు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
వివరాలు
బీసీసీఐ ముందు పెద్ద సవాలు
అందులో ఒకదానిలో మాత్రమే విజయం సాధించాడు. మొదటిసారిగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రోహిత్ గాయపడిన నేపథ్యంలో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది, సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసుకుంది.
తర్వాత అతను పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారత్‌కు ఘనవిజయం అందించాడు.
అనంతరం జరిగిన సిడ్నీ టెస్టులో రోహిత్ దూరంగా ఉండటంతో బుమ్రా మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.
కానీ అదే టెస్టులో అతను తీవ్రమైన వెన్నునొప్పికి గురై బాగా గాయపడ్డాడు. ఆ గాయం వల్ల అతని కెప్టెన్సీ ఆశలకు పెద్ద దెబ్బతగిలింది.
ఈ నేపథ్యంలో, రోహిత్ నిష్క్రమణ తరువాత భారత టెస్ట్ జట్టుకు సరైన కెప్టెన్‌ను ఎంపిక చేయడం బీసీసీఐ ముందు పెద్ద సవాలుగా మారింది.