Ganguly-T20 Team India: భయం లేకుండా ఆడండి: భారత టీ20 వరల్డ్ కప్ జట్టుకు సౌరభ్ గంగూలీ సూచనలు
జూన్ 1 నుంచి వెస్టిండీస్(West indies), అమెరికా(America)లో జరగనున్న టి20 వరల్డ్ కప్(T20 World cup)ని దృష్టిలో ఉంచుకుని భారత మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ (Sourabh Ganguly) కీలక సూచనలు చేశారు. మరి కొద్ది రోజుల్లో జరగబోయే టి20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఎలాంటి భయం లేకుండా ఆడాల్సి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ పై సౌరబ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతమన్నారు. ఆట పట్ల చూపించే అంకిత భావం, చిత్తశుద్ధి విరాట్ ను ఈ స్థాయికి చేర్చాయని చెప్పారు. టి 20 ఫార్మాట్ లో ఆటగాళ్ల వయసుకు సంబంధించి ఎటువంటి నియమాలు లేవన్నారు.
ధోని ఇంకా సిక్సర్లు కొడుతూనే ఉన్నాడు..
ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ఇంకా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూ 30 ఓవర్లు బౌలింగ్ వేస్తున్నాడు. 40 ఏళ్ల ధోని ఇంకా సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నాడు. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ఇలా చాలామంది ఆటగాళ్లు బాగా హిట్టింగ్ చేస్తారని, బౌండరీలు బాదడంలో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నవాళ్లు వారని గంగూలీ అభిప్రాయపడ్డారు. టి20 వరల్డ్ కప్ లో ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందని గంగూలీ చెప్పారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీ, టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపై ఉందని తెలిపాడు.