LOADING...
Asia Cup 2025: అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్‌ పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 
అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్‌ పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Asia Cup 2025: అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్‌ పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ జరగకుండా నిరోధించాలని, దీనిని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఊర్వశి జైన్ అనే న్యాయ విద్యార్థిని మరొక ముగ్గురు వ్యక్తులతో కలిసి సమర్పించారు. మ్యాచ్ ఆదివారం జరగనుంది కనుక అత్యవసరంగా తమ పిటిషన్‌పై విచారణ జరిపించాలని వారు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

వివరాలు 

జాతీయ గౌరవం,ప్రజల మనోభావాలకు విరుద్ధమని పిటిషనర్ల వాదన 

ఈ అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు జడ్జీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అదివారం జరగనున్న మ్యాచ్ కు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక మ్యాచ్ మాత్రమే, జరిగితే జరగనివ్వండి, నష్టమేంటని జస్టిస్‌ జేకే మహేశ్వరి,జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ దారుల తరఫున న్యాయవాది మాట్లాడుతూ, శుక్రవారం జాబితాలో ఈ పిటిషన్ చేర్చకపోతే తన పిటిషన్‌ నిష్ఫలమవుతుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఈ మ్యాచ్‌ జరుగుతోందని గుర్తుచేశారు. అంతేకాకుండా,ఈ మ్యాచ్‌ జరగడం జాతీయ గౌరవానికి వ్యతిరేకమని, ప్రజల మనోభావాలకు ప్రతికూల సందేశాన్ని ప్రసారం చేస్తుందని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు.

వివరాలు 

సైనికుల ప్రాణత్యాగాల కన్నా ఈ మ్యాచ్ ఎక్కువ కాదు 

దేశ ప్రయోజనాలకన్నా, పౌరుల ప్రాణాలకన్నా, సైనికుల ప్రాణత్యాగాల కన్నా ఈ మ్యాచ్ ఎక్కువ కాదన్నారు. క్రికెట్ సహా ఏదైనా ఆటలు, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను, సామరస్యాన్ని అభివృద్ధి చేస్తాయని, అయితే పాకిస్థాన్‌ వంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో మ్యాచ్ నిర్వహించడం తప్పుడు సంకేతాన్ని ప్రజలకు పంపే అవకాశం ఉందని ఊర్వశి జైన్ కోర్టుకు తెలిపారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఈ మ్యాచ్ కారణంగా వేదనకు గురవుతాయని పేర్కొన్నారు.