ధోని గురించే మాట్లాడుతారు.. యువీకి క్రెడిట్ ఇవ్వడం లేదు : గౌతమ్ గంభీర్
భారత జట్టు కంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత పూజ ఎక్కువ కావడంతోనే టీమిండియా గత పదేళ్లుగా ఒక ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిందని పేర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టులో ప్రతి ఒక్కరూ రాణించారన్నారు. కానీ అందరూ ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ గురించే ఎక్కువ మాట్లాడుతారని గంభీర్ అసహనం వ్యక్తం చేశారు. 2011 వన్డే ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదని, జహీర్, రైనా, మునాఫ్ పటేల్ పరిస్థితి కూడా ఇదేనని, ఆ టోర్నమెంట్‌లో సచిన్ అత్యధిక పరుగులు చేశారని, కానీ మనం దాని గురించి మాట్లాడుకోవడం లేదని గంభీర్ తెలిపాడు.
జట్టును మరిచిపోయారు: గంభీర్
మీడియా, జనాలు వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చి జట్టును మరిచిపోయారని ఓ ఇంటర్య్వూలో గంభీర్ వెల్లడించారు. శ్రీలంకతో వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ధోని సిక్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో శ్రీలంక 274 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఆరంభంలోనే సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే గంభీర్ 97 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే ధోనీ కెప్టెన్సీలో గంభీర్‌కు అంతగా పేరు రాలేదు.