Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
నిపుణుల నుంచి సామాన్య అభిమానుల వరకూ ఈ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇవాళ భారత జట్టు ప్రకటించనుంది.
ఇప్పటికే 6 జట్లు తమ జట్లు ప్రకటించగా, భారత్, పాకిస్తాన్ జట్లు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఇవాళ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ సమావేశమవుతోంది.
ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఎంపిక చేయనున్నారు.
Details
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం
ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్‌లలో ప్రారంభమవుతుంది.
టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు తమ మ్యాచ్‌లన్నింటిని దుబాయ్‌లో ఆడనుంది.
ప్రస్తుతం ఏ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదిస్తారనే అంశంపై అందరి దృష్టి నిలిచింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్ల పేలవమైన ఫామ్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లపై ఎక్కువ చర్చ జరుగుతోంది.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ శనివారం ముంబైలో సమావేశమవుతుంది.
Details
వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించే అవకాశం
జట్టు ఎంపిక ప్రక్రియలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయాలు కూడా కీలకంగా మారనున్నాయి.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కోచ్, కెప్టెన్, సెలక్షన్ కమిటీ మధ్య విభేదాలు బయటపడినందున ఈ సమావేశం మరింత ప్రత్యేకంగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుతో పాటు, ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ జట్టును కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఈ సిరీస్‌కు ఎంపికయ్యే ఆటగాళ్ల జాబితా, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల స్థానం, చాలా ఆసక్తికరంగా మారింది.