Mitchell Santner: భారత్‌తో మ్యాచ్ మాకు పెను సవాల్.. మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో కివీస్ అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా భారత్‌తో జరుగనున్న మ్యాచుపై కివీస్ జట్టు దృష్టి సారించింది. ఈ నెల 22వ తేదీన ధర్మశాలలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఆఫ్గాన్ మ్యాచ్ తర్వాత ఆ జట్టు స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మీడియాతో మాట్లాడారు. భారత జట్టు నుంచి తమకు కఠిన సవాళ్లు ఎదురుకున్నాయని పేర్కొన్నారు. సొంత మైదానంలో ఆడుతున్న భారత్‌ను ఓడించడం చాలా కష్టమని, ఈ నేపథ్యంలో ధర్మశాలలో పరిస్థితులను విశ్లేషించుకుంటామన్నారు.
ప్రణాళికలతో ముందుకెళ్తాం : శాంట్నర్
సాధారణంగా అక్కడి వికెట్ పేసుకు అనుకూలిస్తుందని, అయితే మ్యాచ్ సమయానికి పిచ్ ఎలా ఉంటుందనేది కీలకమని, తమ ప్రణాళికలకు కట్టుబడి శ్రమిస్తామని శాంట్నర్ చెప్పుకొచ్చాడు. ఇది చాల సుదీర్ఘమైన టోర్నమెంట్ అని, అన్ని మ్యాచులు గెలిచి, ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన ఇబ్బందేమీ లేదన్నారు. రోహిత్ పవర్ ప్లేలో విరుచుకుపడటం భారత జట్టుకు కలిసి వస్తోందని, ఈ క్రమంలో తమ వ్యూహానికి కట్టుబడి అతనిపై ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు. వన్దే ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లపై న్యూజిలాండ్ విజయం సాధించింది.