Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ఐసీసీ టోర్నీకి భారత్ రావడం కష్టమే. అయితే పాకిస్థాన్ మాత్రం తమ వద్దే ఈ టోర్నీని నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ముందుకు వచ్చిన పీసీబీ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో భారత జట్టు ఉండేందుకు బీసీసీఐ అంగీకరించటం లేదు. ఈ క్రమంలో భారత్ తన మ్యాచ్ ముగిసిన వెంటనే దిల్లీ లేదా చండీగఢ్‌కు వెళ్లాలని పీసీబీ ప్రతిపాదన పెట్టినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీసీసీఐ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో అడుగు పెట్టే దిశగా అంగీకారం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
2008 తర్వాత పాక్ లో పర్యటించని భారత్
బీసీసీఐ వర్గాలు పీసీబీ నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదని కూడా చెబుతున్నాయి. భారత్ పాకిస్థాన్ వెళ్లాలా లేదా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడుతుందని స్పష్టం చేశాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా భారత్ రాకకు సన్నద్ధమైందని కథనాలు వస్తున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికలపై జరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నాయి. ముంబయి ఉగ్రదాడి జరిగిన 2008 తర్వాత, టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫైనల్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.