Jasprit Bumrah: కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదు.. ఆ బాధ్యతను ప్రేమిస్తున్నా: కెప్టెన్ బుమ్రా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గైర్హాజరుకావడంతో, జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా మీడియాతో మాట్లాడారు. కెప్టెన్సీని ఒక పదవిగా చూసే ప్రసక్తే లేదని, తాను బాధ్యతలను ఆస్వాదిస్తానని, చిన్నప్పటి నుంచి కఠినమైన పనులను చేయడమే తన అలవాటని, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనడంలో ఎటువంటి కష్టమూ లేదని, దీనిని ఒక కొత్త ఛాలెంజ్‌గా తీసుకుంటానని బుమ్రా అన్నారు.
తదుపరి సిరీస్‌పై ఫోకస్: బుమ్రా
రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అనేక విషయాలు నేర్చుకున్నానని, సీనియర్ క్రికెటర్‌గా కొత్తవారికి తన అనుభవాలను పంచడం తప్పనిసరిగా చేయాల్సిన పని అని బుమ్రా చెప్పారు. టెస్టు క్రికెట్‌లో పది మందికి కూడా అవకాశం రావడం అరుదని, కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం మరింత విశేషమైన విషయం అని చెప్పారు. ఇటీవలి న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కానీ ఆ ఓటమిపై ఎక్కువగా ఆలోచించడంలేదు,తదుపరి సిరీస్‌పై ఫోకస్ ను కేంద్రీకరించామని బుమ్రా అన్నారు. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో గుణపాఠాలు నేర్చుకున్నామనీ,కానీ ఆ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో తుది జట్టును ఇప్పటికే ఫైనలైజ్ చేశామని,టాస్ సమయంలోనే జట్టు వివరాలను వెల్లడిస్తామని బుమ్రా చెప్పారు.