Rohit Sharma: రోహిత్ శర్మ అడుగులు ఎటు.. కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ..?
వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టులో BCCI కీలక మార్పులు చేయనుంది. రానున్న నాలుగేళ్లలో వైట్‌బాల్ క్రికెట్‌లో బోర్డు అనుసరించాల్సిన వ్యూహంపై రోహిత్ శర్మ(Rohit Sharma), చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో బోర్డు చర్చించనుంది. మరోవైపు రోహిత్ వైట్ బాల్ క్రికెట్ భవితపై కూడా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టును నడిపేందుకు అవసరమైన నాయకుడిని తీర్చిదిద్దడానికి బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే రోహిత్ విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.
ఛాంపియన్ ట్రోఫీ వరకు రోహిత్ కొనసాగే ఛాన్స్!
ఇక రోహిత్ శర్మ పూర్తిగా టెస్టు మ్యాచులపై దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్ 2025 వరకు రోహిత్ కొనసాగే అవకాశం ఉంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీని పక్కనపెట్టి ఆ స్థానాల్లో కొత్తవారిని తెచ్చేందుకు సెలెక్టర్లు పెద్దగా మొగ్గచూపకపోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీ వరకు రోహిత్ కెరీర్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. అప్పటికి రోహిత్ వయస్సు 38కి చేరుతుంది. ఇక కోహ్లీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పటి వరకూ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంటుంది.