Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టును రేపు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అక్షర్ పటేల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో భారత మేనేజ్ మెంట్ అశ్విన్‌ను ఎంపిక చేసింది. అయితే గత రెండు వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా అనేది అందరిలోనూ సందిగ్ధం నెలకొంది. ఈ తరుణంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. అవకాశం ఉంటే అశ్విన్‌ను తప్పకుండా వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేస్తామని రోహిత్ శర్మ చెప్పారు.
వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేస్తాం: రోహిత్ శర్మ
అశ్విన్ క్లాస్ బౌలర్ అని, ఒత్తిడిని ఎలా అధిగమించాలో అతనికి బాగా తెలుసునని, ఆసీస్‌తో గత రెండు వన్డేలు మినహా గతేడాదిన్నర నుంచి అంతర్జాతీయంగా 50 ఓవర్ల క్రికెట్ అశ్విన్ ఆడలేదని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఛాన్నాళ్ల నుంచి భారత్ క్రికెట్‌కు ఆడుతున్నారని, ఎంతో అనుభవం ఉన్న అశ్విన్ ను పక్కన పెట్టలేమని, అతడి బౌలింగ్‌లో ఎన్నో వేరియషన్లను చూపిస్తాడని తెలిపారు. కచ్చితమైన నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పలేమని, బ్యాకప్ గా చాలా మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని హిట్ మ్యాన్ తెలియజేశారు. గత పది వన్డేల్లో భారత్ ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని, బౌలర్లు వికెట్లు తీస్తూ తమ సత్తా ఏంటో నిరూపించారని, తప్పకుండా వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని రోహిత్ వ్యాఖ్యానించాడు.