Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. వర్షం కారణంగా రెండో టెస్టు డ్రాగా ముగియడంతో 2023-25 డబ్ల్యూటీసీ సీజన్ పాయింట్ల టేబుల్లో ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇక పాకిస్థాన్ జట్టు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ తొలి టెస్టులో విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కు చేరింది. టీమిండియా ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనున్న భారత్
కొత్త డబ్ల్యూటీసీ సీజన్ లో భారత్ ఇప్పటివరకూ రెండు టెస్టులు ఆడగా, ఒక మ్యాచులో విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 12 పాయింట్ల, ఇండియా 16 పాయింట్లతో నిలిచింది. ఇక యాషెస్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్ మొదలైంది. ఇందులో అన్ని దేశాలు కలిపి 69 మ్యాచులు ఆడనున్నాయి. ఈ షెడ్యూల్‌లో ప్రతి జట్టు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల షెడ్యూల్‌లో టీమిండియా 20 టెస్టు మ్యాచులను ఆడనుంది. వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ముగిసింది. ఇక టీమిండియా మళ్లీ డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ 3, 4 స్థానాల్లో నిలవడం విశేషం.