Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో యూనస్ నేతృత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
భారత్‌కు దూరంగా ఉంటూ, పాకిస్థాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ పరిణామాల మధ్య, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి.
1971లో విడిపోయిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యం పునఃప్రారంభమైంది.
ప్రభుత్వం ఆమోదించిన తొలి కార్గో నౌక కరాచీలోని పోర్ట్ ఖాసిమ్ నుంచి ఢాకాకు బయలుదేరినట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి.
Details
50,000 టన్నుల బియ్యం ఒప్పందం
ఫిబ్రవరి ప్రారంభంలో ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ 50,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో ఈ ఒప్పందం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
1971 తర్వాత మొదటిసారిగా పాకిస్థాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ నౌక బంగ్లాదేశ్ ఓడరేవుకు ప్రభుత్వ సరుకును తీసుకెళ్తోంది.
ఇది ఇరుదేశాల మధ్య సముద్ర వాణిజ్య సంబంధాల్లో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
మొదటి విడతలో 25,000 టన్నుల బియ్యం తరలించగా, మరో 25,000 టన్నుల బియ్యాన్ని మార్చి ప్రారంభంలో రవాణా చేయనున్నట్లు వెల్లడించింది.
Details
పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు నేరుగా రవాణా
గతేడాది డిసెంబర్‌లో 53 ఏళ్లలో తొలిసారిగా పాకిస్థాన్ నుంచి నేరుగా బంగ్లాదేశ్‌కు కార్గో షిప్ వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
పనామా జెండాతో ఉన్న ఆ నౌక 811 కంటైనర్లలో సోడాయాష్, మార్బుల్ బ్లాక్, ముడివస్త్రాలు, చక్కెర, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మోసుకొచ్చిందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
1971 తర్వాత తొలిసారి ప్రత్యక్ష వాణిజ్యం
1971లో తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు లేవు.
ఇన్నేళ్ల అనంతరం జరుగుతున్న తాజా వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రత్యక్ష రవాణా మార్గాలను సులభతరం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.