Page Loader
Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో 
తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో

Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురైన పరాజయాల గురించి పాకిస్థాన్‌ నేత బిలావల్ భుట్టో స్వయంగా వెల్లడించారు. ప్రత్యేకంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై స్పందనగా, పాకిస్థాన్ కూడా ఒక పార్లమెంటు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి విదేశాంగ మంత్రి అయిన బిలావల్ భుట్టో నాయకత్వం వహించారు. వారిని అమెరికా పంపగా, ఈ పర్యటనలో న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో భుట్టో ప్రసంగించారు.

వివరాలు 

విద్రోహ శక్తులకు తోడ్పాటు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,"కశ్మీర్‌ అంశానికి సంబంధించినంతవరకు మనం ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పటికీ ఉన్నాయి. దీంతోపాటు ఇతర వేదికలపై ఎదురుదెబ్బలు తగిలాయి'' అని వ్యాఖ్యానించారు. అలాగే, ''ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య సమస్యలను పరిష్కరించే సాంకేతిక వ్యవస్థను రూపొందించడం చాలా కష్టం. అయితే, ఇండియా - పాకిస్థాన్ నిఘా సంస్థలు అయిన రా, ఐఎస్‌ఐలు ఒకే చోట కూర్చొని ఉగ్రవాద శక్తులపై సమిష్టిగా పోరాడితే, ఉగ్రవాదం బలహీనపడే అవకాశం ఉంది'' అని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య పదేపదే సంభవిస్తున్న ఘర్షణలు విద్రోహ శక్తులకు తోడ్పాటు కలుగజేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఉగ్రవాదానికి తావిచ్చే దేశం నుంచే శాంతి, సహనంపై బోధనలు వినిపించడమంటే విస్మయం కలిగించేదే.

వివరాలు 

పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది

గతంలోనూ తన దేశం గురించి ఆయన వాస్తవాలు బయటపెట్టారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆయన స్వయంగా అంగీకరించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. ''పాకిస్థాన్‌కి ఒక చరిత్ర ఉంది - ఇది ఎవరికీ కొత్త కాదు. ఆ చరిత్ర వల్ల మేము కొంత నష్టపోయాం. ఈ పరిణామాలన్నీ మాకు గుణపాఠాలు నేర్పాయి. అందుకే ఇప్పుడు సమస్యను పరిష్కరించేందుకు మేము దేశంలో అనేక అంతర్గత సంస్కరణలు చేపట్టాం. నిజమే - పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించిన ఓ చీకటి అధ్యాయాన్ని కలిగి ఉంది. కానీ అది ఓ ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో దురదృష్టకరమైన భాగం మాత్రమే'' అని భుట్టో పాకిస్థాన్‌లోని స్థానిక మీడియాతో స్పష్టం చేశారు.