Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన బైడెన్
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణపై అంగీకారం కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో ప్రకటించారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన బైడెన్
మేము ఒప్పందానికి కట్టుబడి ఉంటాం: బైడెన్
''ఇదొక శుభవార్త. నేను ఇజ్రాయెల్, లెబనాన్ నాయకులతో మాట్లాడాను. టెల్‌అవీవ్-హెజ్‌బొల్లాల మధ్య ఉత్కంఠభరిత పరిస్థితులకు ముగింపు చేకూర్చేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను వారు సమర్థించారు. ఇది ఒక మంచి అడుగు'' అని బైడెన్ తెలిపారు. ఇక ఈ పరిణామంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందిస్తూ, ఈ ఒప్పందం ఎంతకాలం అమలులో ఉంటుందనేది లెబనాన్ వైఖరిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ''మేము ఒప్పందానికి కట్టుబడి ఉంటాం. కానీ ఉల్లంఘనల జరిగితే తగిన ప్రతిస్పందన ఇస్తాం. విజయం సాధించే వరకు మేము ఏకంగా పోరాటం కొనసాగిస్తాం'' అని నెతన్యాహు స్పష్టం చేశారు.