Kamala Harris- Bill Gates: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..కమలా హారిస్‌కు మద్దతుగా బిల్ గేట్స్ భారీ విరాళం..!
రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, కమలాహారిస్‌కు మద్దతుగా ఉన్న ఓ ఎన్జీఓ (సేవాసంస్థ)కు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పెద్ద మొత్తంలో విరాళం అందించారని సమాచారం. ఈ విషయాన్ని కొన్ని అమెరికా వార్తా పత్రికలు వెల్లడించాయి. ఇప్పటి వరకు బిల్‌గేట్స్ ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారో బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆందోళన ఆయన సన్నిహితుల ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవి: బిల్ గేట్స్
ఇదే క్రమంలో, హారిస్‌కు మద్దతు ఇస్తున్న 'ఫ్యూచర్ ఫార్వర్డ్' అనే ఎన్జీఓ సంస్థకు గేట్స్ సుమారు 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 420 కోట్లు) విరాళం అందించినట్లు సమాచారం. ఈ విషయమై గేట్స్ మాట్లాడుతూ, ''ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడం, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వంటి సమస్యలపై పనిచేసే వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను'' అని చెప్పారు. అలాగే, ఆయనకు రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నట్లు వివరించారు. ''కానీ ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవి'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో,ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుని, కమలాహారిస్‌కు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతించినట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం - బైడెన్
బిల్‌గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా హారిస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. న్యూహాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో డెమోక్రటిక్ ప్రచార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ''ట్రంప్‌ను రాజకీయంగా అడ్డుకోవాలి. ఆయన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. కమలాహారిస్‌ను ఓడిస్తే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది'' అని బైడెన్ అన్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో, ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై 'లాక్ హర్ అప్' అనే నినాదాన్ని ప్రాచుర్యం చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశిస్తూ, ఇప్పుడు బైడెన్ ''లాక్ హిమ్ అవుట్'' అంటూ వ్యాఖ్యానించారు.