
Alaska: అలాస్కాలో పుతిన్-ట్రంప్ భేటీ… బేరింగ్ జలసంధి మార్గంలో రష్యా అధ్యక్షుడి చారిత్రక ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
చుట్టుపక్కల దేశాలన్నీ ప్రత్యర్థి శక్తులే,అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ ఉన్నా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండాలను దాటి శాంతి చర్చల్లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కోసం ఆయన అలాస్కా రాష్ట్రంలోని యాంకరేజ్ పట్టణం వద్దనున్న ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరానికి చేరుకోనున్నారు. రష్యా-అమెరికా సంబంధాల పరంగా ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.
వివరాలు
30కిపైగా దేశాల విమానాలకు రష్యా గగనతలంలో నిషేధం
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి నాటో సభ్యదేశాలు తమ గగనతలాన్ని రష్యా విమానాలకు మూసివేశాయి. అమెరికా, కెనడా, నార్వే, ఐరోపా సమాఖ్య దేశాలు ఈ నిర్ణయం అమలు చేసినవాటిలో ముఖ్యమైనవి. దీనికి ప్రతిస్పందనగా రష్యా కూడా 30కి పైగా దేశాల విమానాలకు తన గగనతలంపై నిషేధం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ ప్రయాణించాల్సిన విమానం పశ్చిమార్ధగోళం నుంచి ఉన్న మార్గాన్ని పూర్తిగా మర్చిపోవాల్సిందే. దీంతో ఆయన విమానం రష్యా-అమెరికా మధ్య ఉన్న బేరింగ్ జలసంధి మార్గం ద్వారా ప్రయాణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఈ ప్రయాణం కోసం అవసరమైన అనుమతులు ఇచ్చింది. రష్యా తూర్పు అంచున ఉన్న చుకోట్కా ద్వీపకల్పం నుంచి పుతిన్ బయలుదేరే అవకాశం ఉంది.
వివరాలు
రష్యా-అమెరికా ప్రధాన భూభాగాల మధ్య దూరం కేవలం 88 కిలోమీటర్లు
బేరింగ్ జలసంధి వద్ద రష్యా-అమెరికా ప్రధాన భూభాగాల మధ్య దూరం కేవలం 88 కిలోమీటర్లు మాత్రమే. అదేవిధంగా అలాస్కాకు చెందిన 'లిటిల్ డైమెడ్' ద్వీపం, రష్యాకు చెందిన'బిగ్ డైమెడ్'ద్వీపం మధ్య దూరం కేవలం మూడు మైళ్లే. కోల్డ్‌వార్ కాలంలో రష్యా మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని'ఐస్ కర్టెన్' అని పిలిచేది. అలాస్కా అమెరికా రక్షణలో వ్యూహాత్మక కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ కమాండ్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, సరఫరా కేంద్రాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాపై వచ్చే ముప్పులను గుర్తించేందుకు'ది నార్త్ వార్నింగ్ సిస్టమ్'ఇక్కడే ప్రధాన కేంద్రం కలిగి ఉంది. దీనిని అమెరికా, కెనడా కలిసి నిర్వహిస్తాయి. ఎఫ్-22 రాప్టర్ వంటి అత్యాధునిక యుద్ధవిమానాలు కూడా ఇక్కడ మోహరించబడి ఉన్నాయి.
వివరాలు
ఈ వేదికపై విమర్శలూ వస్తున్నాయి..
యాంకరేజ్‌లోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరంలో దాదాపు 32 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ స్థావరాన్ని సందర్శించే తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ చరిత్ర సృష్టించనున్నారు. అయితే, ఈ సమావేశం వేదికపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి అలాస్కాలోనే ముగింపు పలకాలని ట్రంప్ భావనపై కొంతమంది విశ్లేషకులు వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కాను అమెరికాకు అప్పగించిన చారిత్రక అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. "భూభాగాలు మారడంలో తప్పేమీలేదని... అలాస్కాను మేము అప్పగించగలిగితే, ఉక్రెయిన్ భూభాగం కూడా మాకు వదిలేయవచ్చుకదా" అన్న వాదనతో పుతిన్ ముందుకు వచ్చే అవకాశం ఉందని బ్రిటన్ మాజీ రాయబారి నైజెల్ గౌల్డ్ డేవిస్ 'స్కై న్యూస్'లో పేర్కొన్నారు.