Page Loader
China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం 

China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌ (CPEC)ను అఫ్గానిస్థాన్‌లోకి విస్తరించాలని చైనా,పాకిస్థాన్‌ నేతలు నిర్ణయం తీసుకున్నారు. బీజింగ్‌లో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరగగా, పాకిస్థాన్‌ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇస్సాక్‌ దార్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ, అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాకీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిపెక్‌ విస్తరణపై సరసమైన నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం పాక్‌ డిప్యూటీ ప్రధాని ఇస్సాక్‌ దార్‌ మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో ఉన్నారు. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం చైనా వెళ్లిన పాకిస్థాన్‌ ప్రతినిధి ఆయనే కావడం గమనార్హం.

వివరాలు 

సిపెక్‌ ప్రాజెక్టుపై భారత్‌ వ్యతిరేకత

ఈ సందర్భంగా దార్‌ తన అధికారిక 'ఎక్స్‌' (మునుపటి ట్విట్టర్‌) ఖాతాలో, "పాకిస్థాన్‌, చైనా, అఫ్గానిస్థాన్‌లు ప్రాంతీయ శాంతి, స్థిరత, అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాయి. పరస్పర దౌత్య సంబంధాలను బలపర్చడం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, అభివృద్ధికి సహకరించడం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిపెక్‌ను అఫ్గానిస్థాన్‌ వరకు విస్తరించేందుకు మేము అంగీకరించాం"అని తెలిపారు. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య మరొక సమావేశాన్నిఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇక సిపెక్‌ ప్రాజెక్టుపై భారత్‌ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. దాదాపు 60బిలియన్‌ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతం భాగంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

వివరాలు 

 గ్వదర్‌లో రేవు నిర్మాణం 

చైనా నుండి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలోని గ్వదర్‌ పోర్ట్‌ వరకు సాగే సిపెక్‌ మార్గం వ్యూహపరంగా ఎంతో కీలకమైనదిగా మారింది. చైనా నౌకలు పర్షియన్‌ గల్ఫ్‌ మార్గం ద్వారా గ్లోబల్‌ ఎగుమతి దిగుమతులను నిర్వహించేందుకు ఇది సహకరిస్తుంది. ఆ మార్గాన్ని రక్షించేందుకు గ్వదర్‌లో రేవును నిర్మిస్తున్నారు. ఈ రేవు పూర్తిగా కార్యరూపంలోకి వస్తే, చైనా ఇక మలక్కా జలసంధిపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.