LOADING...
China: ఒకే వేదికపైకి మోదీ, పుతిన్‌,జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్ట్రాంగ్ సంకేతం ఇవ్వడం ఖాయం
ఒకే వేదికపైకి మోదీ, పుతిన్‌,జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్ట్రాంగ్ సంకేతం ఇవ్వడం ఖాయం

China: ఒకే వేదికపైకి మోదీ, పుతిన్‌,జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్ట్రాంగ్ సంకేతం ఇవ్వడం ఖాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం వరకు సుంకం అమలు చేసిన కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఇదే తరహాలో చైనాపై కూడా చర్యలు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కలవబోతుండటం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. వచ్చే వారం చైనాలో ఈ ముగ్గురూ ఒకే వేదికపై ప్రత్యక్షమవుతున్నారు.

వివరాలు 

టియాంజిన్ అనే ఉత్తర ఓడరేవు నగరంలో సమావేశం 

టియాంజిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొననున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా చైనాకు పర్యటనకు వెళ్ళబోతున్నారు. ప్రపంచ దక్షిణ దేశాల ఐక్యతను ప్రదర్శించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని సమాచారం. ఈ సదస్సులో 20 మందికి పైగా ప్రపంచ నాయకులు పాల్గొనబోతున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్ అనే ఉత్తర ఓడరేవు నగరంలో ఈ సమావేశం జరగనుంది. మధ్య ఆసియా,దక్షిణాసియా,ఆగ్నేయాసియా,మధ్యప్రాచ్యం వంటి పలు దేశాల నాయకులు జిన్‌పింగ్ ఆహ్వానంపై హాజరుకానున్నారు.

వివరాలు 

 చైనాకి  మోడీ 

గతంలో,ముఖ్యంగా 2020లో సరిహద్దు వివాదాల కారణంగా భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి.ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ చైనాను సందర్శించగా,ఇప్పుడు మోడీ స్వయంగా చైనా భూభాగంలో అడుగుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా,ఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయ అధికారులు మీడియాతో మాట్లాడుతూ త్వరలో భారత్-చైనా-రష్యాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఈ సంవత్సరం జరిగే శిఖరాగ్ర సమావేశం అతిపెద్దది అవుతుంది: చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ

ఈ సమావేశాన్ని సంబంధాలను మెరుగుపరుచుకునే ఒక ముఖ్యమైన అవకాశంగా ఉపయోగించుకోవాలని "ది చైనా-గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్" ఎడిటర్-ఇన్-చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్న దాని ప్రకారం, 2001లో SCO స్థాపించనప్పటి నుంచి అతిపెద్దది అవుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి అన్నారు. కొత్త రకమైన అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడంలో SCO కీలక శక్తిగా ఎదుగుతోందని వారు పేర్కొన్నారు.