USA: అక్రమ వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా అక్రమ వలసదారుల (Illegal migrants)పై దృష్టి కేంద్రీకరించారు.
దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.
అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి, సంబంధిత దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.
తాజాగా, భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయలుదేరిందని అధికారులు వెల్లడించినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.
సీ17 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా వీరిని తరలిస్తున్నట్లు సమాచారం. భారత్ చేరుకోవడానికి సుమారు 24 గంటలు పడుతుందని అంచనా.
అయితే, ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
వివరాలు
5,000 మంది అక్రమ వలసదారులను పంపించేందుకు పెంటగాన్ సిద్ధం
అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే, వారి గుర్తింపు, నిర్బంధం, తరలింపు ప్రక్రియలను వేగవంతం చేశారు.
మొదటిగా 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు.
ఇక ఎల్ పాసో (టెక్సాస్), శాన్ డియాగో (కాలిఫోర్నియా) ప్రాంతాల్లో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను పంపించేందుకు పెంటగాన్ సిద్ధమైంది.
ఇప్పటికే గ్వాటెమాలా, పెరూ, హోండూరస్ వంటి దేశాలకు యూఎస్ విమానాల ద్వారా పలువురిని తరలించింది.
ఒక్కో వలసదారుడిని తరలించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తోంది. గత వారం గ్వాటెమాలాకు తరలించిన ఒక్క వ్యక్తిపై సుమారు 4,675 డాలర్లను ఖర్చు పెట్టినట్లు సమాచారం.
వివరాలు
18,000 మందిని త్వరలో భారత్‌కు..
అక్రమ వలసదారులపై అమెరికా చేపట్టిన విధానాలపై భారత్ కూడా తన వైఖరిని స్పష్టంగా తెలిపింది.
అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని, ఇది వివిధ రకాల క్రిమినల్ కార్యకలాపాలతో ముడిపడి ఉందని పేర్కొంది.
వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రస్తుతం యూఎస్‌లో సరైన ధ్రువపత్రాలు లేకుండా ఉన్న భారతీయుల సంఖ్య 7,25,000గా అంచనా.
వీరిలో 18,000 మందిని త్వరలో భారత్‌కు పంపేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్లు సమాచారం.
మెక్సికో, ఎల్ సాల్వెడార్ పౌరుల తర్వాత అక్రమంగా ఎక్కువగా నివసిస్తున్న వలసదారుల్లో భారతీయుల సంఖ్య మూడో స్థానంలో ఉంది.
వివరాలు
కెనడా, మెక్సికోపై టారిఫ్ ఒక నెల పాటు నిలుపుదల
అమెరికా మెక్సికో, కెనడాలపై విధించదలచిన 25% టారిఫ్‌లను నెలరోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ రెండు దేశాల నేతలు అమెరికా సరిహద్దుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెక్సికో, కెనడా సరిహద్దుల్లో 10,000 భద్రతా బలగాలను మోహరిస్తామని, మత్తుపదార్థాలు, అక్రమ మనుషుల రవాణాను అడ్డుకునేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు ప్రకటించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రంప్ సుంకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.