LOADING...
Donald Trump: భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు లేవు: ట్రంప్ 
భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు లేవు: ట్రంప్

Donald Trump: భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు లేవు: ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తుందనే కారణంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) భారత్‌పై భారీ సుంకాలను విధించారు. ఈ చర్యపై భారత్‌ కూడా కఠినమైన సమాధానం ఇస్తూ, దేశ రైతుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యం అని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై విధించిన సుంకాల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని న్యూఢిల్లి ప్రయత్నిస్తున్నప్పటికీ, ట్రంప్‌ మాత్రం ఆ దిశగా ముందుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఓవల్‌ కార్యాలయంలో మీడియా ప్రశ్నకు సమాధానంగా, టారిఫ్‌ వివాదం ముగిసే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్యలు ఉండవని ఆయన స్పష్టంచేశారు.

వివరాలు 

భారత్‌ వ్యూహాత్మక భాగస్వామి.. 

ట్రంప్‌ వ్యాఖ్యలకు భిన్నంగా, అమెరికా విదేశాంగ శాఖ మాత్రం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఆ శాఖ ప్రతినిధి టామీ పిగోట్‌ విలేకరులతో మాట్లాడుతూ, భారత్‌ తమ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తత ఉన్నప్పటికీ, న్యూఢిల్లితో పూర్తిస్థాయి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాణిజ్యం, రష్యా చమురు కొనుగోలు వంటి అంశాలపై ట్రంప్‌ స్పష్టమైన వైఖరి తీసుకున్నారని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తామని, దానితో చర్చలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.

వివరాలు 

సుంకాల పెంపు - భారత ప్రతిస్పందన 

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదన్న కారణంతో, ట్రంప్‌ భారత్‌పై ఇప్పటికే అమలులో ఉన్న 25% సుంకాలను 50%కు పెంచారు. కొత్తగా పెరిగిన ఈ 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి ప్రతిస్పందిస్తూ, దేశ రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తి రంగంలో ఉన్న వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అవసరమైతే ఆ భారాన్ని దేశం స్వయంగా భరిస్తుందని ఆయన పేర్కొన్నారు.