
Trump: భారత్‌ను ఉదాహరణగా చూపుతూ..అమెరికా ఎన్నికల ప్రక్రియలో ట్రంప్ భారీ మార్పులు..ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్య అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా ఫెడరల్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆయన ఎన్నికల విధానంలో (US Elections) ప్రధాన మార్పులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇకపై ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి వ్యక్తి తన పౌరసత్వాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
ఆసక్తికరంగా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.
వివరాలు
పేపర్ బ్యాలెట్ విధానం
''ప్రపంచంలో ప్రజాస్వామ్య విధానానికి మార్గదర్శకంగా నిలుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్థలో ప్రాథమిక నిబంధనల అమలులో వెనుకబడి ఉంది. ఉదాహరణకు, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తున్నాయి. కానీ అమెరికాలో పౌరసత్వాన్ని నిర్ధారించుకోవడం ఇప్పటికీ స్వీయ ధ్రువీకరణ ప్రక్రియ మీదే ఆధారపడుతోంది. మరోవైపు, జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మా ఎన్నికల విధానంలో ఇంకా అనేక లోపాలు ఉన్నాయి,'' అని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివరాలు
ఎన్నికల ఫండింగ్‌కు విరాళాలు ఇవ్వకుండా నిషేధం
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఓటు వేయాలనుకునే ప్రతి అమెరికా పౌరుడు తమ పౌరసత్వాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది.
అంటే, యూఎస్ పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రం వంటి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, ఎన్నికల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ, అమెరికా పౌరులే కాకుండా ఇతరులు ఎన్నికల ఫండింగ్‌కు విరాళాలు ఇవ్వకుండా నిషేధాన్ని విధించారు.
ఇకపై ఎన్నికల రోజు నాటికి వచ్చిన మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలనే నిబంధనను కూడా ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమెరికాలో అధికారులు ఎన్నికల రోజుకు తర్వాత వచ్చిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు, అయితే ఈ విధానాన్ని మారుస్తామని ట్రంప్ వెల్లడించారు.
వివరాలు
ఓటింగ్ విధానంపై అనేక అనుమానాలు
ఇందుకు ముందు కూడా ఎన్నికల వ్యవస్థలో మార్పుల గురించి ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
''స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన, మోసపూరిత చర్యలకు ఆస్కారం లేని ఎన్నికలు నిర్వహించడం అత్యంత అవసరం. నిజమైన విజేతను నిర్ణయించేందుకు ఈ మార్పులు అనివార్యం'' అని ఆయన పేర్కొన్నారు.
2020 ఎన్నికల తర్వాత ఓటింగ్ విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన ట్రంప్ ఇప్పుడు మరింత స్పష్టమైన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.