
TikTok: అమెరికాలో టిక్‌టాక్ కొనుగోలుకు అనేక మంది ఆసక్తి : డోనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌ను కొనుగోలు చేయడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో ప్రకటన చేశారు. అమెరికాలో టిక్‌టాక్ విక్రయానికి విధించిన గడువులోగా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారని, దీని కోసం చాలా మంది ముందుకొస్తున్నారని ట్రంప్ తెలిపారు.
వివరాలు
చైనాపై విధించిన సుంకాలను తగ్గించడానికి సిద్ధం
సుమారు 170 మిలియన్ల మంది అమెరికన్లు ఉపయోగిస్తున్న ఈ షార్ట్ వీడియో యాప్‌ను విక్రయించడానికి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ఇటీవల తెలిపారు. దీనికోసం చైనాపై విధించిన సుంకాలను తగ్గించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనలు టిక్‌టాక్ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. అమెరికా ప్రభుత్వానికి చెందిన 'సావరిన్ వెల్త్ ఫండ్' అనే సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా దీనికై ప్రయత్నాలు చేస్తోందని ట్రంప్ ఇప్పటికే పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్ కొన్ని దేశాల్లో నిషేధానికి గురైంది,ఇందులో భారత్ కూడా ఉంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ యాప్ వినియోగంపై ఆంక్షలు విధించాయి.
వివరాలు
పౌరుల సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నట్లు ఆరోపణలు
టిక్‌టాక్ ద్వారా అమెరికా పౌరుల సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి, అయితే టిక్‌టాక్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ క్రమంలో, టిక్‌టాక్ యాజమాన్యాన్ని చైనా వదలకపోతే నిషేధాన్ని తప్పించుకోలేరన్న బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. టిక్‌టాక్ అమెరికాలో కొనసాగాలంటే జనవరి 19 లోపు అమెరికాకు విక్రయించాలనే డెడ్‌లైన్‌ను అమెరికా సుప్రీంకోర్టు బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చింది. అయితే, దీనిని ఏప్రిల్ 5 వరకు పొడిగించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 రోజుల్లోగా టిక్‌టాక్‌ను అమ్మేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. అమెరికా సంస్థలతో జాయింట్ వెంచర్‌లో టిక్‌టాక్ 50% వాటా ఇస్తే, దానికి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటానని ఆయన పునరుద్ఘాటించారు.